రష్యాలో పుష్ప హిట్టా ఫ్లాపా

భారీ హంగామాతో అల్లు అర్జున్ రష్మిక మందన్నతో సహా రష్యా వెళ్లి మరీ ప్రమోషన్ చేసిన పుష్ప పార్ట్ 1 డబ్బింగ్ వెర్షన్ కలెక్షన్ల మీద పెద్ద రచ్చే జరుగుతోంది. పాతిక రోజులకు గాను ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కేవలం 1 కోటి 10 లక్షలు మాత్రమే వచ్చిందనే వార్త ఐకాన్ స్టార్ అభిమానులను నిరాశకు గురి చేసింది.

కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదనే రీతిలో న్యూస్ వైరల్ అయిపోయింది. బన్నీ ఫ్యాన్స్ దగ్గర సరైన సమాధానం కానీ సాక్ష్యం కానీ లేకపోవడంతో కౌంటర్లు ఇవ్వలేక ఇబ్బంది పడ్డారు. దీంతో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పనుల్లో విపరీతమైన బిజీగా ఉన్న మైత్రి బృందం రంగంలోకి దిగింది

ఇప్పటిదాకా పుష్పకు 25 రోజులకు గాను 10 మిలియన్ల రూబుల్స్ వసూలయ్యాయని ఇంకా 774 స్క్రీన్లలో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంని అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది కేవలం రాంగ్ గా వెళ్తున్న పబ్లిసిటీకి చెక్ పెట్టడానికేనని వేరే చెప్పనక్కర్లేదు.

ఈ అధికారిక ప్రకటన ప్రకారం చూసుకున్నా పుష్పకు వచ్చింది తక్కువే. ఇంకా ఎన్ని రోజులు ఆడుతుందనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ డిసైడ్ అవుతుంది తప్పించి ఇప్పటికిప్పుడు హిట్టా ఫట్టా ని తేల్చడం కష్టం. ఒకవేళ ఇదే రన్ ఇంకో నెల రోజులు కొనసాగించినా మహా అయితే ఇంకో కోటి రావొచ్చేమో.

దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే అసలు పుష్ప రష్యా వెర్షన్ ని ఎంతకు అమ్మారు ఎంత వచ్చిందనే వివరాలు బయటికి రావాలి. ఈ స్పష్టత ఉంటే కానీ ఖరారుగా ఏం జరిగిందో అర్థం కాదు. ఈ ప్రచారాన్ని కాసేపు పక్కనపెడితే ఆర్ఆర్ఆర్ కు జపాన్ లో వచ్చిన రెస్పాన్స్ చూసే పుష్ప రష్యా వెళ్లేందుకు తొందరపడిందన్న కామెంట్స్ ఇప్పటికీ వినపడుతుంటాయి.

ఇదంతా ఏమో కానీ పుష్ప 2 ది రూల్ అప్ డేట్స్ కోసం అభిమానులు తహతహలాడిపోతున్నారు. షూటింగ్ అయితే మొదలయ్యింది కానీ ఇంతకీ 2023లోనే రిలీజ్ ఉంటుందా అంటే దర్శకుడు సుకుమార్ దగ్గర కూడా సమాధానం లేదు