ఎన్టీఆర్ స‌ర‌స‌న ఆమెనే ఫిక్స్

జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయి. ర‌క‌ర‌కాల కారణాల వ‌ల్ల ఆల‌స్యం అవుతూ వ‌చ్చిన తార‌క్ 30వ సినిమా ఇంకో నెల రోజుల్లో సెట్స్ మీదికి వెళ్ల‌బోతోంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం గురించి తాజాగా చిత్ర బృందం ఒక అప్‌డేట్ ఇచ్చింది.

ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ మీదికి వెళ్ల‌నున్న ఈ సినిమాను 2024 ఏప్రిల్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కొన్ని నెల‌ల నుంచి ఈ సినిమా ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొంచెం భారీ స్థాయిలోనే జ‌రుగుతున్నాయి.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ గురించి ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ఊహాగానాలు వ‌చ్చాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు చాలా పేర్లు వినిపించాయి. చివ‌రికి బాలీవుడ్ భామే అయిన జాన్వి క‌పూర్‌ను ఎన్టీఆర్‌కు జోడీగా మేక‌ర్స్ ఫిక్స్ చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఎన్టీఆర్ 30లో జాన్వి క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని ఇంత‌కుముందే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టిదాకా అధికారిక స‌మాచారం ఏదీ లేదు. కాగా మ‌రి కొన్ని రోజుల్లో అఫీషియ‌ల్‌గానే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.

జాన్వితో పాటు ఈ సినిమాలో న‌టించే ముఖ్య న‌టీన‌టుల గురించి వ‌రుస‌గా అప్‌డేట్స్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆ ర‌కంగా షూట్ మొద‌ల‌య్యే వ‌ర‌కు అభిమానుల‌ను ఎంగేజ్ చేయ‌నున్నార‌ట‌. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించ‌నుండ‌గా.. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడ‌ట‌.

సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన్ చూసుకుంటాడు. ఎన్టీఆర్ అన్న‌య్య నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి కొర‌టాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయ‌నున్నాడు. తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.