పవన్‌ను తిట్టి.. నన్ను పిలుస్తారు-చిరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రాజకీయంగా అతడి అన్నయ్యే చిరునే పెద్ద మైనస్ అనే అభిప్రాయం బలంగా ఉంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరు ఫెయిలవడం పవన్ మీద కూడా రాజకీయంగా మొదట్నుంచి ప్రతికూల ప్రభావం చూపుతుండగా.. మరోవైపు పవన్ రాజకీయంగా వ్యతిరేకించే, తీవ్రంగా ఘర్షణ పడే వ్యక్తులతో చిరు స్నేహం చేయడం ఇంకో పెద్ద ప్రతికూలతగా ఉంటోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా వైకాపా నేతలు చాలామందితో చిరు ఎంత సన్నిహితంగా ఉంటాడో తెలిసిందే. పవన్‌ను లం..కొడకా అని తిట్టిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇటీవల కలిసినపుడు కూడా చిరు చాలా సన్నిహితంగా కనిపించాడు. చిరు మొహమాటం, అందరితో మంచిగా ఉండాలనే ఆలోచన తీరు పవన్ అభిమానులు, జనసైనికులకు అస్సలు రుచించట్లేదు. కాగా ఈ విషయమై తాజాగా చిరు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.

పవన్ మీద వచ్చిన విమర్శలు, ఆయనకు ఎదురయ్యే తిట్ల గురించి చిరును ప్రశ్నించగా.. ‘‘అవన్నీ వింటే చాలా బాధ కలుగుతుంది. నాకు వాడు బిడ్డ లాంటి తమ్ముడు. నా చేతులతో ఎత్తుకుని పెంచాను. కించిత్ స్వార్థం లేని వ్యక్తి కళ్యాణ్. డబ్బు యావ లేదు. పదవీ కాంక్ష లేదు. తన కోసం ఏదీ ఆలోచించడు. మొన్నటిదాకా వాడికి సొంత ఇల్లు కూడా లేదు. మాకందరికీ ఉన్నాయి, నువ్వూ కట్టుకో అంటే చూద్దాం అన్నాడు. వేళకు అన్నం తినడు. సరైన బట్టలు కూడా వేసుకోడు. సమాజానికి ఏదో చేయాలన్న తపనతో అన్నీ వదిలేసిన యోగి లాంటి వాడు. అంత చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి రాజకీయాలనే మురికి కూపంలోకి వెళ్లాడు. మురికిని తీసేయాలనుకునేవారికి కొంత మురికి అంటడం మామూలే. ఒక స్వచ్ఛమైన ప్రయత్నం చేస్తున్నపుడు ప్రోత్సహించాలి. కానీ మితిమీరి వాడిని అనరాని మాటలు అన్నపుడు బాధ కలుగుతుంది.

పైగా పవన్‌ను తిట్టినవాళ్లు మళ్లీ నా దగ్గరికి వచ్చి పెళ్ళిళ్ళకు, పేరంటాలకు పిలుస్తారు. రమ్మని బతిమాలతారుు. నా తమ్ముడిని అన్ని మాటలు అన్న వాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి వస్తోందే, కలవాల్సి వస్తోందే అని బాధగా ఉంటుంది’’ అని చెప్పాడు.