మతి పోగొట్టిన ఖుషీ కలెక్షన్లు

Kushi
Kushi

నిన్న రీ రిలీజ్ జరుపుకున్న ఖుషికి తెలుగు రాష్ట్రాల్లో దక్కిన స్పందన అంతా ఇంతా కాదు. ఈ ట్రెండ్ మెల్లగా పతనమవుతోందని అనుకుంటున్న టైంలో ఇరవై ఏళ్ళ పాత సినిమాకు వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ సైతం నివ్వెరబోతోంది. చాలా చోట్ల పెద్ద స్టార్ హీరో మూవీ రిలీజ్ రోజు ఎలా ఉంటుందో అంతకు మించిన సందడి థియేటర్ల వద్ద కనిపించింది. పక్క రాష్ట్రాల మీడియా సైతం ఆ వీడియోలతో షాక్ తిన్న మాట వాస్తవం. వరల్డ్ వైడ్ కేవలం ఒక్క రోజుకే 3 కోట్ల 50 లక్షలకు పైగా గ్రాస్ రావడం చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోకు వచ్చే ఓపెనింగ్ అది

దాదాపు అన్ని చోట్ల పవర్ స్టార్ నామస్మరణ ఊగిపోయింది. ఇది మొదటిసారి విడుదలయ్యే టైం నాటికి ఇప్పటి చాలా మంది పవన్ ఫ్యాన్స్ ఆ టైంలో బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమా చూడలేదు. వినడమే తప్ప ఆ ఎక్స్ పీరియన్స్ వాళ్లకు తెలియదు. నిన్న ప్రత్యక్షంగా అనుభవించి ఆ జ్ఞాపకాలను దాచుకోబోతున్నారు. మణిశర్మ పాటలకు హాల్లో హమ్మింగ్ చేయడం, సిద్దు మధుల మధ్య జరిగే సంభాషణకు యువత కోరస్ ఇవ్వడం, షో అయ్యాక భారీ ఎత్తున బాణాసంచా పేల్చడం ఇలా రచ్చ గురించి చెప్పుకుంటూ పోతే పేజీలు సరిపోయేలా లేవు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ జరిగిన రగడ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇప్పుడీ ఖుషి పుణ్యమాని రీ రిలీజులు ఊపందుకోబోతున్నాయి. ఫిబ్రవరిలో 1998 క్లాసిక్ తొలిప్రేమ రాబోతోంది. అదే నెల చిరంజీవి గ్యాంగ్ లీడర్ ని షిఫ్ట్ చేశారు. ఏఎం రత్నం భారతీయుడు, 7జి బృందావన్ కాలనీ పునఃవిడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. రజనీకాంత్ నరసింహ, బాషాల ప్లానింగ్ జరుగుతోంది. చూస్తుంటే ఇంకో ఏడాది పొడవునా ఇవి జరిగేలా ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే కొన్ని కేంద్రాల్లో మొన్న వచ్చిన రాజయోగం, లక్కీ లక్ష్మణ్ లాంటి లేటెస్ట్ రిలీజులకు కనీస జనం లేక ఖుషి ఎక్స్ ట్రా షోలతో రీ ప్లేస్ చేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీన్నే ఇంగ్లీష్ ర్యాంపేజ్ అంటారేమో