ఏజెంట్ ఇంకెన్నాళ్లు ఈ దోబూచులాట

అక్కినేని మూడో తరం వారసుల్లో రెండోవాడైన అఖిల్ కెరీర్ లోనే కాదు ఒకరకంగా చెప్పాలంటే నాగార్జునకు కూడా ఖర్చుపెట్టలేనంత బడ్జెట్ తో రూపొందుతున్న ఏజెంట్ మీద అభిమానులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో మాటల్లో చెప్పేది కాదు. అసలే 2022 అక్కినేని ఫ్యామిలీకి ఏ మాత్రం అచ్చిరాలేదు. ఏదో బంగార్రాజు సంక్రాంతి సీజన్ వాడుకుని హిట్ అనిపించుకోవడమే కానీ ది ఘోస్ట్, లాల్ సింగ్ చద్దా, థాంక్ యు చేసిన గాయాలు అంతా ఇంతా కాదు. ఆఖరికి టీవీ షో బిగ్ బాస్ 6 కూడా ఫ్లావు కావడం ఏ మాత్రం జీర్ణించుకోలేనిది. అందుకే ఏజెంట్ మీద ఆ మాత్రం అంచనాలు పెట్టుకోవడం తప్పేమి కాదు

ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా ఓ మేకింగ్ వీడియో వదిలిన ఏజెంట్ టీమ్ రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. కేవలం సమ్మర్ 2023 అని చెప్పి వదిలేశారు. ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ ఉన్నప్పుడు అదేదో విడుదల తేదీ స్పష్టంగా ముందే చెప్పేస్తే సరిపోతుందిగా. ఆ మధ్య డిసెంబర్ చివర్లో సంక్రాంతికి వస్తామని ఓ పోస్టర్ వదిలారు. ఒకవేళ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలో ఒకరు డ్రాప్ అయితే ఆ అవకాశాన్ని వాడుకుందామని చూశారు. అంత కాన్ఫిడెన్స్ ఆ టైంలోనే ఉన్నప్పుడు ఇన్ని వాయిదాలు పడ్డాక కూడా క్లారిటీ లేకపోతే ఎలానేదే ఫ్యాన్స్ ప్రశ్న. ఎంతసేపూ పోస్టర్లు స్టిల్స్ తో పనవ్వదు కదా.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం నిర్మాత అనిల్ సుంకర ఏప్రిల్ రిలీజ్ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారు. కానీ ఆ నెల మొత్తం ప్యాక్ అయిన నేపథ్యంలో చాలా రిస్క్ చేస్తున్న ఏజెంట్ ని దింపాలా వద్దా అనే అయోమయం సదరు టీమ్ లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 14న ఈయనదే చిరంజీవి భోళా శంకర్ ఉంది. ఇది పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అలాంటప్పుడు ఏజెంట్ కి అదే లాక్ చేస్తే సరిపోతుందిగా. ఇలా ఆలస్యం చేసే కొద్దీ దాన్ని ఎవరో ఒకరు తీసేసుకోవడం మళ్ళీ మిస్ అయ్యిందే అని ఫీలవ్వడం లాంటి తలనెప్పులు వస్తాయి. వీలైనంత త్వరగా ఏజెంట్ ఈ దోబూచులాటను ఆపేస్తే బెటర్