ఆహా అనిపించిన చరణ్ బాలయ్యల బంధం

ప్రభాస్ ఆన్ స్టాపబుల్ ఎపిసోడ్ అంచనాలకు తగ్గట్టుగానే సెన్సేషన్ అవుతోంది. ఏకంగా ఆహా యాప్ క్రాష్ కావడమే దానికి ఉదాహరణ. ఇది రిపేర్ చేయడానికి గంటల తరబడి సమయం పట్టిందంటేనే ఎంత తీవ్రమైన లోడ్ పడిందో అర్థం చేసుకోవచ్చు. ముందే ట్రైలర్ లో లీక్ చేసినప్పటికీ రామ్ చరణ్ తో ఫోన్ సంభాషణ అనుకున్న దానికన్నా ఎక్కువ లెన్త్ తో ఫ్యాన్స్ ని మెప్పించింది. ముందు డార్లింగ్ కాల్ అందుకున్న చరణ్ కొన్ని క్షణాలకే బాలయ్యతో లైన్ లోకి వచ్చేశాడు. గౌరవంగా సర్ అని సంబోధించడం, బాగున్నారా అంటూ ఇద్దరూ ఒకరికొకరు క్షేమ సమాచారాలు చెప్పుకోవడం చూసేందుకు బాగుంది.

సంభాషణ ప్రారంభంలోనే బాలయ్య శతమానంభవతి అని ఆశీర్వదించడం చూపరులను ఆకట్టుకుంది. మిత్రుడైన చిరంజీవి కొడుకుగా తనకు చరణ్ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పకనే చెప్పారు బాలయ్య. ఇద్దరూ కలిసి ప్రభాస్ ని చేసిన ర్యాగింగ్ ఓ రేంజ్ లో సాగింది. మేడం ఎవరూ అంటూ మాములుగా ఆడుకోలేదు. ఒకదశలో ప్రభాస్ ఇదేదో తనకు రివర్స్ అవుతోందని గుర్తించి బాలయ్యని వారించే ప్రయత్నం చేయడం, చరణ్ ని శత్రువా ఇంత ద్రోహం చేస్తావా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పడం ఇవన్నీ ఆడియన్స్ బాగా కనెక్టయ్యేలా ఉన్నాయి

మూడో సీజన్ లో మెగా పవర్ స్టార్ వచ్చే సూచనలు ఇంకా స్పష్టమయ్యాయి. నువ్వెప్పుడూ వస్తావని బాలయ్య అడిగిన ప్రశ్నకు చరణ్ సమాధానం చెబుతూ జస్ట్ ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నానని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పడం మరో స్వీట్ మెమరీ. ఈ ఫోన్ కాల్ క్లైమాక్స్ లో బాలయ్య రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లో చరణ్ పెర్ఫార్మన్స్ ని ప్రత్యేకంగా గుర్తు చేసి మెచ్చుకోవడం, అంతకు ముందు ఫ్రెండ్స్ ఇద్దరినీ ప్యాన్ ఇండియా స్టార్లు అభివర్ణించడం బాగా కుదిరింది. బ్రో కోడ్ అంటూ ఇప్పటి జెనరేషన్ హీరోలు పెట్టుకున్న ప్రత్యేక భాష ప్రస్తావన ఈ సందర్భంలోనే బయటికి వచ్చింది.