నాలుగేళ్ళ క్రితం యాక్షన్ జానర్ లో అద్భుతమైన హిట్ ఇచ్చిన గూఢచారి వల్లే అడవి శేష్ కి ఫాలోయింగ్ పెరిగిన మాట వాస్తవం. చాలా తక్కువ బడ్జెట్ తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మంచి క్వాలిటీతో సినిమా తీయడం విమర్శకులను సైతం మెప్పించింది.
అప్పటికే స్పై బ్యాక్ డ్రాప్ లో ఎన్నో మూవీస్ వచ్చినప్పటికీ ఇందులోని డిఫరెంట్ టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా శేష్ కెరీర్ లోనే పెద్ద విజయం సాధించిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు శశికిరణ్ తిక్కా టేకింగ్ కు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఆ కారణంగానే ఈ ఇద్దరి కాంబో మేజర్ రూపంలో మరో ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకుంది
తాజాగా గూఢచారి 2ని అధికారికంగా ప్రకటించారు. అనూహ్యంగా డైరెక్టర్ మారిపోయాడు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈయన ఎవరో కాదు మేజర్ ఎడిటరే. ఈ సీక్వెల్ కి శశికిరణే ఉంటారని మూడు నాలుగేళ్ల క్రితం అడవి శేష్ చెప్పాడు.
తర్వాత మేజర్ చిత్రీకరణ మొదలయ్యాక ఈ ప్రస్తావన రాలేదు. ఆ ప్రాజెక్టులో విపరీతమైన జాప్యం జరగడంతో గూఢచారి 2 గురించి డిస్కషన్ రాలేదు. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత జి2 పేరుతో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అసలు కారణాలు బయటకి చెప్పలేదు కానీ శేష్ కు శశికిరణ్ కు మధ్య ఏం జరిగిందనేది సస్పెన్స్ గా ఉంది
ఈ వినయ్ కుమార్ గత కొన్నేళ్ల నుంచి శేష్ టీమ్ లోనే ఉన్నాడు. మేజర్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు కూడా. గూఢచారి 2ని భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏకె ఎంటర్ టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ముంబైలో జనవరి 9న జరిగే గ్రాండ్ ఈవెంట్ లో ఓ వీడియో రిలీజ్ తో పాటు మీడియా సుముఖంగా ఇతర వివరాలు ప్రకటించబోతున్నారు. ఫస్ట్ పార్ట్ లో యాల్ప్స్ పర్వతం దగ్గర కథను ముగించిన గూఢచారి ఇప్పుడు విదేశాలకు వెళ్లబోతున్నాడు. ఇటీవలే హిట్ 2 తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న అడవి శేష్ కి ఇప్పుడీ కొనసాగింపు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో.