దోసె వేయడం కూడా రాని హీరోయిన్

టాలీవుడ్లో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన స్నేహా ఉల్లాల్ గుర్తుందా? జూనియర్ ఐశ్వర్యారాయ్‌గా గుర్తింపు పొందిన ఈ నీలికళ్ల సుందరి.. చాన్నాళ్ల నుంచి అస్సలు వార్తల్లో లేదు. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివ్‌గానే ఉంటోంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఒక వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదో ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో కిచెన్ దగ్గర చెఫ్‌లందరూ పక్కన ఉండగా ఆమె దోసె పోసే ప్రయత్నం చేసింది. ఈ పనిలో ఆమెకు అస్సలు ప్రవేశం లేదని.. గరిట పట్టుకోగానే అర్థం అయిపోయింది.

గరిటలో పిండి తీసుకుని.. పెనం మీద ఇష్టం వచ్చినట్లు పోస్తూ వెళ్లింది స్నేహ. పిండిని మధ్యలో పోసి చాలా సింపుల్‌గా తిప్పుతూ వెళ్తే దోసె షేప్ వచ్చేస్తుంది. కానీ స్నేహకు ఈ సింపుల్ టెక్నికల్ తెలియక పలక మీద బలపంతో గీసినట్లు.. పెనం మీద గరిటతో ఇష్టం వచ్చినట్లు తిప్పుతూ వెళ్లింది. చివరికది విచిత్రమైన షేప్‌లోకి వచ్చింది. మానవ మాత్రుడెవడూ దాన్ని దోసె అని భావించే అవకాశమే లేదు. ఈ వీడియో చూసి ఈ అమ్మాయికి కనీసం దోసె పోయడం కూడా రాదంటే వంట గది వైపే అడుగు వేయదేమో అని కామెంట్లు చేస్తున్నారు.

ఐతే తానెంత పేలవంగా దోసె పోసినప్పటికీ.. ఆ వీడియోను స్నేహ ఇలా షేర్ చేసుకోవడం విశేషమే. తెలుగులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ అనే హిట్ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన స్నేహ.. ఆ తర్వాత ‘సింహా’ లాంటి భారీ చిత్రంతో పాటు మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. ‘సింహా’ బ్లాక్ బస్టర్ అయినా ఆమె కెరీర్ ఊపందుకోకపోవడంతో కొంత కాలానికే తెర మరుగైపోయింది.