న‌య‌న‌తార పనైపోయిందా?

ఇండియాలో సూప‌ర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న అతి కొద్దిమంది హీరోయిన్ల‌లో Nayanthara ఒక‌రు. ఒక‌ప్పుడు విజ‌య‌శాంతి చూసిన స్టార్‌డ‌మ్‌ను కొన్నేళ్ల నుంచి ఆమె అనుభ‌విస్తోంది. కేవ‌లం ఆమె పేరు చూసి థియేట‌ర్ల‌కు వెళ్లిపోయే ప్రేక్ష‌కులు తమిళంలో, తెలుగులో చాలామందే ఉన్నారు. ఈ ఫాలోయింగ్ చూసుకునే ఆమె కొన్నేళ్ల నుంచి ఎక్కువ‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. ఒక ద‌శ వ‌ర‌కు అవి బాగానే ఆడాయి. కానీ క‌థ‌ల ఎంపిక‌లో పొర‌బాట్ల వ‌ల్ల ఈ మ‌ధ్య న‌య‌న్ సినిమాలు అస్స‌లు వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు.

స్టార్ల స‌ర‌స‌న క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు బాగా త‌గ్గిపోవ‌డం ఆమె కెరీర్‌కు మైన‌స్ అవుతోంది. రెండేళ్లుగా న‌య‌న్ చేసిన సినిమాల‌న్నింటికీ అప్ప‌టిక‌ప్పుడు బాగానే హైప్ వ‌స్తోంది. కానీ అవేవీ ఆడ‌ట్లేదు. గ‌త ఏడాది నేత్రిక‌న్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప‌ల‌క‌రించింది న‌య‌న్. ఓటీటీలో రిలీజైన ఆ సినిమా తుస్సుమ‌నిపించింది.

ఇక ఈ ఏడాది కేఆర్‌కే అనే సినిమాలో విజ‌య్ సేతుప‌తి, Samanthaల‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అది కూడా ఫ్లాప్ అయింది. ఇక తెలుగులో కొంచెం గ్యాప్ త‌ర్వాత ఆమె చిరంజీవి క‌ల‌యిక‌లో న‌టించిన గాడ్ ఫాద‌ర్ కూడా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఇందులో న‌య‌న్ ఏ ర‌కంగానూ ఆక‌ట్టుకోలేకపోయింది. న‌య‌న్ ఫ్యాన్స్ త‌న పాత్ర చూసి నిరాశ చెందారు.

ఇక డిసెంబ‌రు నెల‌లో న‌య‌న్‌కు షాక్‌ల మీద షాక్‌లు త‌గిలాయి. ఈ నెల ఆరంభంలో ఆమె న‌టించిన మ‌ల‌యాళ మూవీ గోల్డ్ రిలీజై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ప్రేమ‌మ్ త‌ర్వాత ఆ చిత్ర ద‌ర్శ‌కుడు అల్ఫాన్సో పుతెరిన్ తీసిన సినిమా తీవ్రంగా నిరాశ ప‌రిచింది. ఇక తాజాగా Connect అనే హార్ర‌ర్ మూవీ న‌య‌న్‌కు షాకిచ్చింది. ఈ సినిమా అటు త‌మిళంలో, ఇటు తెలుగులో క‌నీస ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. వ‌రుస‌గా సినిమాలు దెబ్బ తిన‌డంతో న‌య‌న్ మార్కెట్ మీద ప్ర‌తికూల ప్ర‌భావ‌మే ప‌డ్డ‌ట్లుంది. వ‌య‌సు కూడా పెరిగిపోయి, లుక్స్ కూడా కొంచెం తేడా కొడుతుండ‌డంతో న‌య‌న్ కెరీర్ చ‌ర‌మాంకానికి వ‌చ్చేసిన‌ట్లే క‌నిపిస్తోంది.