బాలీవుడ్ యువ నటుడు Sushant Singh Rajput మరణించి రెండున్నరేళ్లు దాటిపోయింది. స్వశక్తితో హీరోగా నిలదొక్కుకుని, స్టార్ ఇమేజ్ సంపాదించిన అతను.. ఇంకా పెద్ద స్టార్ అవుతాడనుకుంటున్న దశలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది అభిమానులను దుఃఖసాగరంలో ముంచెత్తాడు.
ప్రాథమికంగా సుశాంత్‌ది ఆత్మహత్యగానే భావించినప్పటికీ.. తర్వాత అది అనుమానాస్పద మృతిలా ప్రచారంలోకి వచ్చింది. అతడిది ఆత్మహత్యేనా.. అదే నిజమైతే అందుకు పురిగొల్పిన కారణాలేంటి.. అందుకు డిప్రెషనే కారణమా.. అతణ్ని ఎవరైనా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారా.. అన్న చర్చ చాన్నాళ్ల పాటు సాగింది. కొందరేమో అతను ఆత్మహత్య చేసుకునే స్థితిలో లేడని, తన మరణం వెనుక ఎవరో ఉన్నారని సందేహాలు వ్యక్తం చేశారు. సుశాంత్ అభిమానులు సుదీర్ఘ కాలం పాటు సోషల్ మీడియాలో ఇదే రకమైన సందేహాలు వ్యక్తం చేస్తూ ట్రెండ్ చేశారు. కానీ పోలీసులైతే ఈ దిశగా ఎలాంటి ఆధారాలు బయటికి తీయలేకపోయారు.
ఐతే సుశాంత్ మృతి విషయం అందరూ మరిచిపోయిన టైంలో ఇప్పుడు అతడిది ఆత్మహత్య కాదు హత్య అంటూ ముంబయిలో అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కూపర్ ఆసుపత్రికి చెందిన ఉద్యోగి ఒకరు సంచలన ప్రకటన చేశాడు. రూప్ కుమార్ సింగ్ అనే ఆ ఉద్యోగి సుశాంత్ పోస్టు మార్టం టీంలో ఉన్నాడట. అతను పోస్టుమార్టం సమయంలో ఏం జరిగిందో తాజాగా వివరించాడు.
ఆ రోజు మాకు పోస్టుమార్టం కోసం ఐదు మృతదేహాలు వచ్చాయి. అందులో సుశాంత్ బాడీ ఒకటి. అతడి ఒంటి మీద, అలాగే మెడ మీద మూడు మార్కులు చూశాను. ఆ విషయం ఉన్నతాధికారులకు చెప్పాను. వాటి ఫొటోలు తీసుకోమని వాళ్లు చెప్పారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని చెప్పగలను. అతడిది హత్యే. ఆ రోజు రాత్రి మేం పోస్టుమార్టం పూర్తి చేసి Policeలకు బాడీని అప్పగించాం అని రూప్ కుమార్ తెలిపాడు. ఐతే పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏం రాశారు.. తాను అనుమానం వ్యక్తం చేసిన విషయాలపై ఉన్నతాధికారులు, పోలీసులు ఏం చేశారు అన్నది రూప్ కుమార్ వెల్లడించలేదు. అతడి స్టేట్మెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates