మలయాళంలో ‘ప్రేమమ్’ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్‌తో కథానాయికగా పరిచయం అయింది అనుపమ. ఆ తర్వాత ఆమెకు తమిళంతో పాటు తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. ఐతే ఆమె ఎక్కువ పేరు, అవకాశాలు తెచ్చుకుని పెద్ద రేంజికి వెళ్లింది తెలుగులోనే. ఒక టైంలో ఆమె ఊపు చూసి తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరవుతుందని అనుకున్నారు. కానీ మధ్యలో ఎందుకో ఆమె జోరు తగ్గింది. కెరీర్లో గ్యాప్ వచ్చేసింది.
ఒక టైంలో ఆమె కెరీర్ ముగిసిందనే ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. హిట్లు లేవు, అవకాశాలు తగ్గిపోవడమే అందుక్కారణం. ఐతే 2022 సంవత్సరంలో అనుపమ బాగానే బౌన్స్ బ్యాక్ అయింది. ఆల్రెడీ ఆమె ‘కార్తికేయ-2’తో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఐతే ఈ సినిమాలో అనుపమ పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. ఆమె ప్రత్యేకంగా ఏమీ చేయడానికి లేకపోయింది. కానీ ఇప్పుడు కొత్త సినిమా ‘18 పేజెస్’లో మాత్రం అనుపమ మెస్మరైజ్ చేసేసింది.
‘18 పేజెస్’ కోసం సుకుమార్ ఒక మోస్తరుగా అనిపించే కథ రాశారు. దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ప్రథమార్ధం వరకు కథనాన్ని బాగానే నడిపించాడు. ద్వితీయార్ధంలో తడబడ్డాడు. హీరో నిఖిల్ మంచి పెర్ఫామెన్సే ఇచ్చాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. కానీ వీళ్లందరినీ మించి ఎక్కువ మార్కులు పడేది మాత్రం అనుపమకే. ఈ పాత్రను చాలా తక్కువమంది మాత్రమే చేయగలరు అనిపించేలా నందిని క్యారెక్టర్‌ను ఆమె పండింది.
పాత్రకు తగ్గట్లుగా సింపుల్ మేకప్‌తో, ట్రెడిషనల్‌గా కనిపిస్తూ ఆమె యూత్‌నే కాక అందరినీ ఆకట్టుకుంది. తన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూటయ్యాయి. నటన విషయంలోనూ అనుపమ చాలా బాగా చేసింది. ఈ పాత్రతో ప్రేక్షకులు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. ఆ పాత్రతో ప్రేమలో పడిపోతున్నారు.
సినిమాలో చనిపోయందనుకున్న అనుపమ పాత్ర బతికే ఉందని తెలిసినపుడు థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ ఆమెతో ప్రేక్షకులు ఎంత కనెక్ట్ అయ్యారో చెప్పడానికి నిదర్శనం. డీసెంట్ టాక్ రావడంతో ‘18 పేజెస్’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంతో అనుపమ కెరీర్ మళ్లీ పరుగందుకోవడం ఖాయం.