సినిమాల ఫలితాలు ముందుగానే ఎవరి చేతిలోనూ ఉండవు. ఆడతాయనే నమ్మకంతో దర్శక నిర్మాతలు సిద్ధపడతారు. కానీ స్క్రిప్ట్ చెత్తగా ఉంటే మాత్రం దానికి బాధ్యత ముమ్మాటికీ రచయితదే. డైరెక్షన్ అంటే మనకే తెలుసని యాక్షన్ అంటే నాదేనని విర్రవీగే దర్శకులకు హీరోలకు ప్రేక్షకులు సుర్రుమనేలా వాతలు పెడతారు.
తాజాగా విడుదలైన బాలీవుడ్ మూవీ సర్కస్ దానికి ఉదాహరణగా నిలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత చెప్పుకోదగ్గ మొదటి సక్సెస్ గా నిలిచిన సూర్యవంశీ దర్శకుడు రోహిత్ శెట్టి తీర్చిదిద్దిన మాస్టర్ పీస్ ఇది. బుకింగ్స్ ఘోరంగా ఉండగా మొదటి రోజు కేవలం ముక్కుమూలిగి మూడు కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.
సరే ముందస్తు బజ్ గురించి పక్కనపెడితే ఏదో కాంబినేషన్ ను నమ్మి థియేటర్ కు వెళ్లినవాళ్లకు పట్టపగలు నాలుగు గోడల మధ్య చుక్కలు కనిపించేశాయి. రణ్వీర్ సింగ్ డ్యూయల్ రోల్ లో చేసిన ఓవరాక్షన్ చూడలేక అభిమానులే ఇదేం టార్చర్ బాబోయ్ అని ట్వీట్లు పెడుతున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మన సినిమాలనే కాపీ కొడుతూ రీమేకులు చేసుకునే రోహిత్ శెట్టి మళ్ళీ పాత రొటీన్ మసాలానే నమ్ముకుని ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు. చిల్లర జోకులుతో ప్రతి ఆర్టిస్టు పోటీ పడుతూ ఇచ్చిన మితిమీరిన ఎక్స్ ప్రెషన్లతో రెండున్నర గంటలు థియేటర్లో కూర్చోవడం నరకంగా ఫీలయ్యారు.
అసలు కథలో విషయం ఉంటేగా ఒక్కటైనా పాజిటివ్ గా చెప్పుకోవడానికి. హీరోతో పాటు సైడ్ రోల్ తో కూడా ద్విపాత్రాభినయం చేయించి రెడీ తరహా కన్ఫ్యుజింగ్ డ్రామా తీసిన రోహిత్ ఏ విభాగంతోనూ కనీసం యావరేజ్ అవుట్ ఫుట్ రాబట్టుకోలేకపోయాడు.
బయట ఇంటర్వ్యూలలో గొప్ప మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా బిల్డప్ ఇచ్చుకునే రోహిత్ శెట్టి ఇప్పుడీ ఫలితం ఏం సమాధానం చెబుతాడో చూడాలి. అన్నట్టు మన పూజా హెగ్డే ఒక రణ్వీర్ కి భార్యగా నటించింది. టాలీవుడ్లో నెత్తిన బెట్టుకునే వాళ్ళుండగా అక్కడికెళ్లి ఇలాంటి ప్రాధాన్యం లేని పాత్రలు ఎంచుకోవడం ఏమిటో తనకే తెలియాలి