తెలుగు తెర నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మరణం సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. అనేక మంది పాత, కొత్త తరం నటులతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ జ్ఞాపకాల దొంతరలు కదులుతున్నా యి. అనేక గుబాళింపైన జ్ఞాపకాలు.. తెలుగు ప్రేక్షకులను కలచి వేస్తున్నాయి. కైకాల ఇలాంటి వారా.. అలాంటి వారా.. అంటూ.. ఆయన స్మృతులను నెమరు వేసుకుంటున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కైకాలతో తనకు ఉన్న అనుబంధం చర్చించుకున్నారు. “ఉప్పు చేప అంటే.. కైకాలకు ఎంతో ఇష్టం. ఎన్ని కూరలు ఉన్నా.. ఎన్ని పచ్చళ్లు, పిండి వంటలు పెట్టినా.. పక్క ఉప్పు చేప-పప్పు చారు లేకపోతే.. ఏదో వెలితిగా ఫీలయ్యేవారు” అని చిరు ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అంతేకాదు.. ఇటీవల జరిగిన ఓఘటనను కూడా చిరు గుర్తు చేసుకున్నారు.
“నటన, రుచికరమైన భోజనం రెండూ కైకాలకు ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు. గతేడాది, ఈ ఏడాది ఆయన జన్మదినం సందర్భంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిలిగిన సంతృప్తి. అప్పుడు ఆయన సురేఖతో.. “అమ్మా.. ఉప్పు చేప వండి పంపించు” అని అన్నప్పుడు.. “మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం” అని చెప్పాం. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడ్డారు. కానీ, ఇప్పుడు మన మధ్యనుంచి వెళ్లిపోయారు” అని గుర్తుచేసుకున్నారు.