స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, సక్సెస్ ట్రాక్.. ఈ ప్రమాణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇండియాలో ఇప్పుడు నయనతారే నంబర్ వన్ హీరోయిన్ అంటే అతిశయోక్తి లేదేమో. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూనే స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో కూడా మెప్పించడం ఆమెకే చెల్లింది.
ఐతే గతంతో పోలిస్తే కమర్షియల్ సినిమాలు తగ్గించేసిన నయన్.. ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తోంది. 40వ పడికి చేరువ అవుతూ కూడా మంచి జోరు మీద సాగుతున్న నయనతారను నటన విషయంలో ఎవరూ క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. ప్రమోషన్లకు రాదన్న కంప్లైంట్ తప్పిస్తే తనను ఎవరూ విమర్శించే ఛాన్సివ్వదు నయన్. అలాంటి హీరోయిన్ గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్ పరోక్షంగా సెటైర్లు వేయడం గమనార్హం.
నయన్ పేరెత్తకుండా ఒక ఇంటర్వ్యూలో తన గురించి మాట్లాడుతూ.. ‘‘ఒక సూపర్ స్టార్ హీరోయిన్ ఓ సినిమాలో ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్న సీన్లో నటించింది. అలాంటి సీన్లో కూడా ఆమె ఫుల్ మేకప్ వేసుకుని, ఐ లైనర్ రాసుకుని కనిపించింది. బాధాకరమైన సీన్లో అలా మేకప్ వేసుకుని ఎలా నటిస్తారో నాకర్థం కాదు’’ అని పేర్కొంది. కాగా ‘కనెక్ట్’ ప్రమోషన్లలో భాగంగా ఒక తమిళ యాంకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార ఈ విషయంపై స్పందించడం విశేషం.
‘‘ఒక హీరోయిన్ ఇంటర్వ్యూ చూశాను. ఆమె నా పేరు ఎత్తలేదు కానీ.. తను అన్నది నా గురించే. ఆమె చెప్పినట్లు మేకప్ లేకుండా, సహజంగా, డీగ్లామరస్‌గా నటించే సినిమాలు కొన్ని ఉంటాయి. అవి ఆర్ట్ సినిమాలు. వాటిలో ఆమె చెప్పినట్లే కనిపించాలి. కానీ కమర్షియల్ సినిమాల్లో అంత సహజంగా అంటే కుదరదు. నిజానికి ఆ సీన్ కోసం నేను జుట్టు కొంచెం చింపిరిగా చేసుకుని.. కొంచెం డీగ్లామరస్‌గా కనిపిద్దామని చూశాను. కానీ దర్శకుడు మాత్రం అలా అవసరం లేదన్నాడు. మేకప్‌తోనే చేయమన్నాడు. అలాంటపుడు నేనేం చేయను? కమర్షియల్ సినిమాల్లో ఇలాంటివి తప్పవు’’ అని మాళవిక పేరెత్తకుండానే ఆమె విమర్శకు బదులిచ్చింది నయన్.
Gulte Telugu Telugu Political and Movie News Updates