ట్రోలింగ్ కి ఛాన్సిస్తున్న బన్నీ బృందం ఎలివేషన్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పుష్పతో వచ్చిన ప్యాన్ ఇండియా గుర్తింపు కొత్తగా ఎవరూ గుర్తుచేయాల్సిన అవసరం లేదు. తెలుగు కంటే ఎక్కువగా నార్త్ లోనే భీభత్సమైన కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం అక్కడి ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరిచింది. ఆ కారణంగానే పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టడంలో విపరీతమైన ఆలస్యం జరిగింది. అంచనాలకు మించి ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ కోసం అదనంగా ఏడాది ఖర్చు పెడితే బన్నీ అంతే ఓపిగ్గా విలువైన సమయం ఖర్చవుతున్నా లెక్క చేయకుండా అదే హెయిర్ స్టైల్ ని చాలా సహనంతో భరిస్తూ వచ్చాడు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది.

అయితే గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళినప్పుడు అక్కడి నిర్వాహకులు బన్నీకి ఇస్తున్న ఓవర్ ఎలివేషన్లు సోషల్ మీడియాలో అనవసరమైన ట్రోలింగ్ కి చోటిస్తున్నాయి. నిన్న 18 పేజెస్ వేడుకలో అల్లు అర్జున్ స్టేజి పైకి వస్తున్న క్రమంలో ఓ బృందం డాన్సు చేసుకుంటూ ఏదో బాహుబలిని సింహాసనం దగ్గరకు తీసుకెళ్తున్న రేంజ్ లో హడావిడి చేయడం యాంటీ ఫ్యాన్స్ కామెంట్ చేయడానికి అవకాశం ఇచ్చింది. నిజానికి అక్కడ ఫోకస్ పడాల్సింది నిఖిల్ మీద. 18 పేజెస్ ఉన్న కంటెంట్ గురించి హై లైట్ అవ్వాలి. దానికి బదులు పుష్ప జపమే మళ్ళీ వినిపించడం ప్రధాన సమస్య.

ఆ మధ్య తమ్ముడు శిరీష్ ఊర్వశివో రాక్షసివో వేడుకలో కూడా ఇదే జరిగింది. వచ్చిన గెస్టులతో సహా అందరూ పనికట్టుకుని పుష్ప 2ని ప్రమోట్ చేయడానికి ఉత్సాహం చూపించడంతో అసలు ఉద్దేశం పక్కకెళ్ళిపోయింది. రిలీజ్ కు ఇంకో ఏడాదికి పైగా టైం ఉన్నప్పుడు ఇన్నేసి సార్లు బిల్డప్ ఇవ్వడం అవసరం లేదు. పైగా ఏదో బన్నీని ప్రసన్నం చేసుకోవడమే తమ లక్ష్యమన్న తరహాలో అల్లు కాంపౌండ్ చేస్తున్న ఈ తతంగం హార్డ్ కొర్ ఫ్యాన్స్ కి సైతం నచ్చడం లేదు. పుష్ప 2కి ఆల్రెడీ సరిపడా బజ్ ఉంది. దాన్ని హుందాగా కాపాడుకోవాలి కానీ ఇలా ఎక్కువ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ట్రోలింగే.