డబ్బింగ్ సినిమాల ముందు జాగ్రత్త

మొన్న శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అవతార్ వాటర్ లో తడిసిన తెలుగు ప్రేక్షకులకు ఈ వారం నాలుగు కొత్త రిలీజులు పలకరిస్తున్నాయి. అందులో మళ్ళీ రెండు డబ్బింగ్ వే ఉన్నాయి. 23న రవితేజ ధమాకా, నిఖిల్ 18 పేజెస్ తో ఢీ వద్దనుకుని ఒక రోజు ముందు 22నే రిలీజ్ కాబోతున్నాయి.

విశాల్ లాఠీకి ప్రమోషన్లైతే గట్టిగానే చేస్తున్నారు కానీ బయట మాత్రం ఏమంత హైప్ కనిపించడం లేదు. ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేసినా రావాల్సిన బజ్ ఇంకా మొదలుకాలేదు. ఇది హిట్ కావడం విశాల్ కు చాలా అవసరం. మార్కెట్ కొంతైనా రికవర్ చేసుకోవడం దీని సక్సెస్ మీద ఆధారపడి ఉంది

నయనతార కనెక్ట్ ని అసలే పబ్లిసిటీ లేకుండా వదిలేశారు. యువి సంస్థ అనువాద బాధ్యతలు తీసుకున్నా అంచనాలు పెంచే విధంగా ఏమీ చేయలేదు. టైటిల్ రోల్ తనదే అయినా సినిమాని తన పేరు మీదే అమ్మినా రానని చెప్పే నయన్ మీద నిర్మాతలు ఆశలేం పెట్టుకోలేదు కానీ కేవలం 99 నిమిషాల నిడివితో వస్తున్న ఈ హారర్ థిల్లర్ కోసం జనాన్ని థియేటర్ కు రప్పించడం అంత సులభం కాదు. పైపెచ్చు ఇలాంటి కంటెంట్ ఓటిటిలలో బోలెడుంది. వాటికన్నా అదిరిపోయేలా కనెక్ట్ ఉందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించాలి. గేమ్ ఓవర్ తో మెప్పించిన అశ్వత్ మరిముత్తు దీనికి దర్శకుడు.

మొత్తానికి అడ్వాన్స్ గా రావడం వల్ల లాఠీ, కనెక్ట్ నిర్మాతలు చాలా తెలివిగా వ్యవహరించారు. అయితే చిక్కులు లేకపోలేదు. అవతార్ ది వే అఫ్ వాటర్ కు చాలా చోట్ల వారం అగ్రిమెంట్లు జరిగాయి. సెకండ్ వీక్ మొదలవ్వగానే అందులో అధిక శాతం ధమాకా, 18 పేజెస్ కు వెళ్లిపోతాయి.

విశాల్ నయన్ లకు దక్కే ఇరవై గంటల గడవులోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవాలి. అప్పుడే కనీసం వారం పాటు ఆడియన్స్ వస్తారు. నెలకు పైగానే చెప్పుకోదగ్గ కమర్షియల్ సినిమా లేక బాక్సాఫీస్ డల్ గా ఉంది. అవతార్ వీరంగమాడినా బిసి సెంటర్స్ కు కావాల్సింది హాలీవుడ్ హంగామాలు కాదు. మాస్ బొమ్మలు. చూడాలి మరి ఇవేం చేస్తాయో!