ఏమో గుర్రమెగరావచ్చనేది సామెత కావొచ్చు కానీ రాజమౌళి సినిమా ఆస్కార్ అందుకోవడం మాత్రం నిజమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిలీజైన తొమ్మిది నెలల తర్వాత కూడా దాని ప్రమోషన్లే బాధ్యతగా, గ్లోబల్ ఆడియన్స్ కి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తిరుగుతున్న జక్కన్న కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గోల్డెన్ గ్లొబ్ పురస్కారాల్లో టాప్ క్వాలిటీ ఇంటర్ నేషనల్ మూవీస్ తో పోటీ పడుతూ బెస్ట్ మూవీ, మ్యూజిక్ విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకోవడం ఇప్పటికే అతి పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
శేఖర్ కపూర్ లాంటి దిగ్గజ దర్శకులు సైతం ఆర్ఆర్ఆర్ ని నాన్ ఇంగ్లీష్ క్యాటగిరిలో వేయకూడదని, ఇలాంటి అత్యున్నత ప్రమాణాలున్న కంటెంట్ ని భాషతో సంబంధం లేకుండా గుర్తించాలని అప్పీల్ చేయడం చూస్తే ఎంతగా ట్రిపులార్ చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. న్యూ యార్క్, లాస్ ఏంజిల్స్ క్రిటిక్స్ ఇలా ఏ విదేశీ అవార్డులు ప్రకటించినా వాటిలో ఆర్ఆర్ఆర్ కు స్థానం దక్కుతోంతో. పన్నెండు వందల కోట్లు వసూలు చేసిన కెజిఎఫ్ 2, తమిళ మీడియా తెగ మోసేసిన పొన్నియన్ సెల్వన్ 1, నార్త్ జనాలు జబ్బలు చరుచుకున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ఏదీ కనీసం ఆర్ఆర్ఆర్ దరిదాపుల్లో లేకపోవడం మరో సంతోషకరమైన విషయం.
ఇంకో రెండున్నర నెలల్లో జరగబోయే ఆస్కార్ సంబరంలో తన ఉనికి ఉండేలా చేసుకునేందుకు రాజమౌళి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీ కాదు కాబట్టి జనరల్ క్యాటగిరీలోనే నెగ్గి సత్తా చాటాలని ఆర్ఆర్ఆర్ ఉవ్విళూరుతోంది. బాహుబలికి మించి గుర్తింపు ఇప్పుడీ ట్రిపులార్ దక్కించుకోవడం విశేషం. మరోపక్క ఇవన్నీ చూస్తూ బాలీవుడ్ బర్నాల్ బ్యాచులు మాములుగా రగిలిపోవడం లేదు. పిఎస్ 1 ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా అక్కసు వెళ్లగక్కడం మొదలుపెట్టారు. ఎవరు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఆస్కార్ గడపకు ఆర్ఆర్ఆర్ దగ్గరగా ఉన్న మాట వాస్తవం.