కాంతార’పై పరుచూరి వారి సూపర్ రివ్యూ


తన అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి 300కు పైగా సినిమాలకు రచన చేసిన లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ. కొన్నేళ్ల నుంచి వీళ్లిద్దరూ సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేరు. ఐతే గోపాలకృష్ణ తన అన్నయ్యలాగా పూర్తిగా లైం లైట్లో లేకుండా అయితే లేరు. ‘పరుచూరి పలుకులు’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి తన అనుభాన్నంతా రంగరిస్తూ ఔత్సాహిక ఫిలిం మేకర్లకు, అలాగే సినిమాలకు బాగా ఇష్టపడే ప్రేక్షకులకు విలువైన పాఠాలు చెబుతున్నారాయన. పాత సినిమాలతో పాటు కొత్త సినిమాలనూ పరుచూరి తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.

తాజాగా ఆయన దృష్టిని ‘కాంతార’ సినిమా ఆకర్షించింది. చిన్న సినిమాగా విడుదలైన రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అబ్బురపరిచిన ఈ కన్నడ చిత్రానికి అదిరిపోయే రివ్యూ ఇచ్చారు పరుచూరి. సినిమాను థియేటర్లో చూడలేకపోయినందుకు విచారం వ్యక్తం చేస్తూ.. ‘కాంతార’ గురించి పరుచూరి ఏం చెప్పారంటే..

“ఈ సినిమా ప్రోమోలు చూసి ఇది ఆత్మలకు సంబంధించిన సినిమా అనుకున్నా. కానీ సినిమా చూశాక ఈ కథ వేరని అర్థమైంది. కర్ణాటకలో ఎన్నో సంవత్సరాల కిందట జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. నా దృష్టిలో ఇదొక అభ్యుదయ చిత్రం. మన తెలుగులో వచ్చిన ‘మా భూమి’ తరహా సినిమా ఇది. ఆ సినిమాలో ప్రజలు పోరాడారు. ఈ చిత్రంలో భూతకోల క్రీడాకారుడు పోరాటం చేశాడు. ఇందులో ఎన్నో విషయాలను మెచ్చుకోవాలి. ముఖ్యంగా రిషబ్ శెట్టి కథ.. కథనం అద్భుతంగా తీర్చిదిద్దాడు. సినిమా ప్రథమార్ధం చూస్తూ విలన్ జమీందారు అని ఎవరూ అనుకోరు. పోలీసే విలన్ అనుకుంటారు. అడవి మీద కన్నేసింది జమీందారే అని చూపించి సెకండాఫ్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. అచ్యుత్ కుమార్ ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు. అలాగే హీరో తల్లిగా చేసిన నటిని ఎవరితో పోల్చాలో అర్థం కాలేదు. అడవిలో ఉండే నిజమైన మహిళలా ఆమె నటించింది. క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంది. నటన, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. ఇలా ఏ విషయంలోనూ వెతుకుదామన్నా లోపం కనిపించలేదు. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకులు అద్భుత విజయం అందించారు. ఈ సినిమాను థియేటర్లలో చూడనందుకు విచారిస్తున్నా” అని పరుచూరి అన్నారు.