టిల్లు 2 వెనుక ఏం జరుగుతోంది

ఏదైనా సినిమా అధికారికంగా ప్రకటించాక రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లకముందే హీరోయిన్లు మారడం సహజం. చాలా సార్లు జరిగిందే. ఒక్కోసారి చిత్రీకరణ మొదలయ్యాక తప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికేవో కారణాలు ఉంటాయి. అయితే పదే పదే చేంజ్ అయితే మాత్రం లేనిపోని అనుమానాలు వస్తాయి. డీజే టిల్లు 2 విషయంలో ఇదే జరుగుతోంది. ముందు దర్శకుడు మారాడు. ఫస్ట్ పార్ట్ టేకప్ చేసిన విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ వచ్చాడు. సరే ఇందులో అంత లోతుగా ఆలోచించాల్సింది ఏముంది లెమ్మని ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. కట్ చేస్తే సిద్దు జోడిగా నటించాల్సిన భామలతోనూ సమస్యలొస్తున్నాయి.

ముందు శ్రీలీలను లాక్ చేశారు. ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలు చేతిలో ఉంచుకున్న ఈ పెళ్లి సందడి బ్యూటీ మంచి ఛాయస్ అనుకున్నారు. తీరా చూస్తే ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చింది. కొద్దిరోజులు అయ్యాక తను కూడా డ్రాప్ అయ్యింది. నెక్స్ట్ మడోన్నా సెబాస్టియన్ ని అడిగారు. ఫోటో షూట్ చేశాక క్యారెక్టర్ కి అంతగా సూట్ కాదని భావించి నో అన్నారట. అయితే అసలు టాక్ వేరేలా ఉంది. టిల్లు 2లో ముద్దు సీన్లు చాలా ఉన్నాయని, వాటిలో నటించేందుకు ఇబ్బందవుతుందని ముందే గుర్తించి ఒక్కొక్కరుగా నో చెప్పారట. ఇప్పుడు మీనాక్షి చౌదరి పేరు తెరపైకి వచ్చింది.

ఫైనల్ గా ఎవరు కన్ఫర్మ్ అవుతారో చెప్పలేకపోతున్నారు. అయినా మొదటి భాగంలో నటించిన నేహా శెట్టినే తీసుకోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు రాసుకున్న కథ ప్రకారం తనను మెయిన్ హీరోయిన్ గా చేసే స్కోప్ లేదట. రిలీజ్ డేట్ కూడా ముందే లాక్ చేసుకుని దానికి అనుగుణంగా షూటింగ్ ప్లాన్ చేసుకున్న టిల్లు 2కి ఇవన్నీ ఇబ్బంది కలిగించే పరిణామాలే. కేవలం దీని కోసమే తాను గతంలో కమిట్ అయిన ఒకటి రెండు సినిమాలను రెమ్యునరేషన్లు వెనక్కు ఇచ్చి మరీ వదులుకున్న సిద్దు జొన్నలగడ్డ ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటాడో. రచయిత తనే కాబట్టి అదేమంత కష్టమూ కాదు.