రాజమౌళి దృష్టిలో చరణ్.. కానీ చిరు ఏమో

సినిమాల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ప్యాషన్ ఎలాంటిదో చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆయన తనయుడు రామ్ చరణ్.. ‘ఎన్డీటీవీ’ వార్షిక పురస్కారాల వేడుకలో చిరంజీవి గురించి గొప్పగా చెప్పాడు. ఈ వేడుకలో ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా చరణ్ ఆసక్తికర ప్రసంగం చేశాడు.

ఈ సందర్భంగా అతను తన కంటే తండ్రి గురించే ఎక్కువ మాట్లాడాడు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా బ్లాక్‌బస్టర్ కంటే ముందు రాజమౌళి తనతో ‘మగధీర’ సినిమా చేసిన రోజుల గురించి చరణ్ మాట్లాడాడు. తనకు ఫోన్ చేసి ‘మగధీర’ కథను చిరంజీవికి నరేట్ చేసి ఆయన ఆమోదం కూడా తీసుకుందామని చెప్పగా.. తాను ఇంటికి ఆహ్వానించినట్లు చరణ్ గుర్తు చేసుకున్నాడు. తమ ఇంట్లో చిరంజీవికి రాజమౌళి కథ చెబుతున్న సమయంలో తాను కూడా ఆ గదిలో కూర్చున్నట్లు వెల్లడించాడు.

రాజమౌళి కథ చెబుతుండగా చిరు బాగా ఇన్వాల్వ్ అయ్యారని.. ఇంటర్వెల్ సీన్ చెప్పేసరికి చాలా ఉద్వేగంతో తాను హెలికాఫ్టర్ నుంచి ఎలా దూకాలనే విషయాన్ని చిరు చాలా సీరియస్‌గా రాజమౌళిని అడిగారని.. అప్పడు రాజమౌళి ‘‘సార్ ఈ కథ మీకు కాదు, మీ కొడుక్కి’’ అని చెప్పారని చరణ్ గుర్తు చేసుకున్నాడు. చిరు వెంటనే తమాయించుకుని ఈ కథ చరణ్‌కా అని ఎగ్జైట్మెంట్ తగ్గించుకున్నాడని.. ఏదైనా కథ వింటుంటే ముందు తననే అందులో ఊహించుకుని ఏం చేయడానికైనా చిరు రెడీ అయిపోతారంటూ చరణ్ ఈ ఉదాహరణ చెప్పాడు.

ఈ వయసులో కూడా చిరులో అదే ఉత్సాహం ఉందని.. తాము ఆయనకు పోటీనో, ఆయనకు తాము పోటీనో చెప్పలేకపోతున్నామని చరణ్ వ్యాఖ్యానించాడు. ఇక తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చిరు.. దర్శకులు, నిర్మాతలు అని కాకుండా నీ స్టాఫ్‌ను బాగా చూసుకో అని సలహా ఇచ్చారని.. తన చుట్టూ ఉన్న వాళ్లు బాగుండాలన్నది ఆయన అభిమతమని చరణ్ తెలిపాడు.