రెండో పెళ్లిపై మీనా క్లారిటీ

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల ప్రైవసీకి అసలు విలువే లేకుండా పోతోంది. చాలా డీప్‌గా వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతున్న జనాలు.. కొన్ని విషాదకర, బాధాకర సందర్భాల్లోనూ వారిని విడిచిపెట్టడం లేదు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ చనిపోతే.. ఆయన ఆస్తులు, వాటాల గురించి చర్చలు పెట్టాయి యూట్యూబ్ ఛానెళ్లు.

ఇప్పుడు సీనియర్ నటి మీనా రెండో పెళ్లి వ్యవహారం కూడా సోషల్ మీడియాకు ఒక టాపిక్‌గా మారింది. ఆమె భర్త విద్యాసాగర్ ఐదు నెలల కిందట చనిపోయిన సంగతి తెలిసిందే. కొవిడ్ అనంతర దుష్పరిణామాల కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఐతే భర్త చనిపోయి ఆరు నెలలైనా కాకముందే మీనా రెండో పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది మీనాను బాధించి మీడియాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.

తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలను మీనా ఖండించింది. తన భర్త మరణం తాలూకు బాధ నుంచి తాను ఇంకా కోలుకోలేదని.. అప్పుడే తన రెండో పెళ్లి గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తమ ప్రైవసీని అందరూ గౌరవించాలని ఆమె కోరింది. మీనా భర్త మరణించినపుడు అందుకు గల కారణాలపైనా రకరకాల ప్రచారాలు జరిగాయి. అప్పుడు కూడా మీనా ఈ ప్రచారాలు కట్టిపెట్టాలని తమ కుటుంబ గోప్యతకు భంగం కలిగించవద్దని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా వార్తలను ఆమె ఖండించింది.

మీనా, ఆమె కూతురు భవిష్యత్తు దృష్ట్యా ఆమెకు రెండో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు, తెలిసిన వారిలోనే సంబంధం కుదుర్చుకున్నట్లు రూమర్లు వచ్చాయి. మీనా భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు కానీ.. భర్త మరణించి ఆరు నెలలు కూడా కాకముందే ఇలాంటి ప్రచారాలు చేయడం మాత్రం సరికాదు.