రాజుగారి కామెంట్స్ తో తీగలు తెగిపోతున్నాయ్

మొన్నటివరకు చాలా ఆచితూచి మాట్లాడిన సీనియర్ మరియు యాక్టివ్ నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె ప్రోగ్రామ్‌లో చెప్పిన మాటలతో.. ఇండస్ట్రీలో చాలామందికి పెద్ద షాకే తగిలింది. ‘ఇండస్ట్రీలో ఎవడిదారి వాడిదే. జస్ట్ ఆ క్షణం వరకే యాక్షన్ అంతా.. తరువాత ఎవరి ప్లానింగ్ వాళ్ళదే.

కాంబినేషన్ కలిపామా.. ఖర్చు పెట్టామా.. అమ్మేశామా.. నిర్మాతలు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు రిస్క్ గేమ్ ఆడుతున్నారు’ అంటూ.. ఇంకా చాలా చాలా పెద్ద కామెంట్స్ చేశారు దిల్ రాజు. ఆయన మాటలను దీర్ఘంగా విశ్లేషించిన కొందరు నిర్మాతలు ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారట.

అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీయడం డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే జస్ట్ గాల్లో దీపం బిజినెస్ అని కామెంట్ చేసిన దిల్ రాజు.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎందుకు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఎన్నికలు ఎందుకు అంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్క సినిమాలో యాక్ట్ చేసినా కూడా మెంబర్ షిప్ తీసుకుని ‘మా’ సభ్యత్వం తీసుకోవచ్చు. ఆ తరువాత కంటెస్ట్ చెయ్యొచ్చు. అలా చేసి గెలిస్తే అదో హోదాగా భావిస్తుంటారు కొందరు నటులు. అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా అంతే. కాని యాక్టివ్‌గా లేని నటులు, యాక్టివ్‌గా లేని నిర్మాతలే ఈ సంఘాల్లో యాక్టివ్‌గా ఉంటారు. వాళ్లందరూ ఇండస్ట్రీలో ఎందుకు అని ప్రశ్నించినట్లు ఇప్పుడు దిల్ రాజు వ్యాఖ్యలు అర్ధమవుతున్నాయ్. దానితో చాలామంది హర్ట్ అవుతున్నారు.

అయితే రాజు గారి వ్యాఖ్యల్లో నిజంలేకపోలేదు. ఫామ్ లో ఉన్న బ్యాట్స్‌మెన్‌కే పిచ్ తాలూకు లోటుపాట్లు తెలుస్తాయ్ కాని, ఎక్కడో కామెంటరీ బాక్స్‌లో కూర్చుని కామెంట్ చేసేవాళ్ళకు అంతగా అర్ధంకాదు. ఇప్పుడు రాజుగారు చెప్పినదానిబట్టి చూసుకుంటే.. సినిమా తాలూకు గొడవలను సాల్వ్ చేసుకోవడానికి వరుసగా సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్లే కావాలి కాని, ఎప్పుడో చిన్నప్పుడు ఒక సినిమా తీసి సమాఖ్యలో మెంబర్స్ అయిపోయినవాళ్ళు అవసరం లేదు. అందుకే ఆయన కామెంట్స్‌తో తీగలు తెగుపోతున్నాయని అంటున్నారు ఫిలింనగర్ జనాలు. కాకపోతే త్వరలోనే దిల్ రాజు మీద డిసిప్లీనరీ యాక్షన్ తీసుకోవాలంటూ కొందరు ఖాళీగా ఉన్న నిర్మాతలు ఇప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది సాధ్యపడేదేనా?