దిల్ రాజు కుండబద్దలు కొట్టేశాడు

దిల్ రాజు.. ఈ పేరు కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతుంటుంది. కొన్నిసార్లు పాజిటివ్ కావచ్చు. కొన్ని సార్లు నెగెటివ్‌గా ఉండొచ్చు. కానీ ఈ పేరు మాత్రం తరచుగా హాట్ టాపిక్ అవుతుంటుంది. టాలీవుడ్లో దిల్ రాజుకు ముందు, వెనుక పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నప్పటికీ.. ఆయనలా ఇంకెవ్వరూ వార్తల్లో ఉండరు. ఇటీవల వరుసగా ఆయన నెగెటివ్ వార్తలతోనే ట్రెండ్ అవుతున్నారు. ‘కార్తికేయ-2’కు అడ్డం పడ్డారని మూణ్నెల్ల ముందు.. ‘వారసుడు’ సినిమాకు ఎక్కువ థియేటర్లు అట్టి పెట్టుకుంటున్నారని ఈ మధ్య ఆయన వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

‘వారసుడు’ ఇష్యూపై ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు ఇటీవలే వెల్లడించిన రాజు.. అంతకంటే ముందు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ప్రోగ్రాం ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పాల్గొన్నాడు. అక్కడ ఆయన చాలా విషయాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేశాడు.

తన అసలు పేరు వెంకట్రామిరెడ్డి అయితే.. ‘దిల్ రాజు’గా ఎందుకు మారానో వివరించడం మొదలుపెట్టి అనేక విషయాలపై ఈ ఇంటర్యూలో మాట్లాడాడు రాజు. ప్రోమోలో చాలా మెరుపులే కనిపించాయి. కేవలం 37 థియేటర్లు తన చేతిలో ఉంటే.. తాను ఎలా టాలీవుడ్లో ఏకఛత్రాధిపత్యం సాధిస్తానని.. మోనోపలీకి ఎక్కడ ఛాన్స్ ఉందని రాజు ప్రశ్నించాడు. ఇండస్ట్రీకి పెద్ద అంటూ ఎవ్వరూ ఉండరని.. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వరి మాటా వినరని.. సినిమా పరిశ్రమ అంటే ఒక కుటుంబం అనే మాటలు పేరుకే.. ఇక్కడ కలిసి అందరూ ఒకే మాట మీద నడవడం అనేది ఉండదని తేల్చేశాడు రాజు.

సినిమాలకు రావడం వల్ల పాపులారిటీ పెరిగి ఉండొచ్చు కానీ.. ఆర్థికంగా గొప్పగా ఏమీ లాభపడిపోలేదన్నట్లుగా రాజు మాట్లాడాడు. తాను ప్రొడక్షన్లోకి వచ్చినపుడు రియల్ ఎస్టేట్లోకి వెళ్లిన వాళ్లు ఇప్పుడు చాలా పెద్ద రేంజిలో ఉన్నారని.. వారితో పోలిస్తే తాను ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నానని రాజు తెలిపాడు. మొత్తంగా తన బ్యాలెన్స్ షీట్ అయితే ప్లస్‌లో ఉందని మాత్రం రాజు అంగీకరించాడు. డిస్ట్రిబ్యూషన్లో వరుసగా ఎదురు దెబ్బలు తగిలినపుడు ఏమైందో.. తాను ఏ పరిస్థితుల్లో నిర్మాణంలోకి రావాల్సి వచ్చిందో కూడా ఈ కార్యక్రమంలో వివరించినట్లున్నాడు రాజు. ప్రోమో చూస్తే మాత్రం ఇదొక బ్లాక్‌బస్టర్ ఇంటర్వ్యూ అని, రాజు ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పాడని అర్థమవుతోంది.