ప‌వ‌న్ సినిమాకు బాగానే హైప్ ఇచ్చారే

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు వాటంత‌ట అవి హైప్ తెచ్చుకుంటాయి త‌ప్ప‌.. చిత్ర బృందం హైప్ ఇవ్వ‌డం త‌క్కువ‌. ఎందుకంటే ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకోడు. ఆయ‌న‌తో ప‌ని చేసేవాళ్లు కూడా త‌న దారిలోనే వెళ్తుంటారు. ప్ర‌మోష‌న్ల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అందులోనూ రీఎంట్రీ త‌ర్వాత ప‌వ‌న్ ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం సినిమాలు పూర్తి చేయ‌డం జ‌ర‌గ‌ట్లేదు.

ఎప్పుడు షూటింగ్‌కు అందుబాటులో ఉంటాడో.. ఎప్పుడు ఏ సినిమాను పూర్తి చేస్తాడో అర్థం కాకుండా ఉంది. ఇలా ప‌వ‌న్ డేట్ల స‌మ‌స్య వ‌ల్ల బాగా ఇబ్బంది ప‌డుతున్న సినిమాల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఒక‌టి. ఇది చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న భారీ చిత్రం. కానీ ఈ సినిమా షూటింగ్ ఆగి ఆగి సాగుతోంది. ఇటీవ‌లే కొత్త షెడ్యూల్ మొద‌లై సినిమా టీంలో కొంచెం ఉత్సాహం వ‌చ్చింది. వేస‌వి విడుద‌ల ల‌క్ష్యంగా టీం ముందుకు సాగుతోంది. ఇంత‌లో అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రిచేలా సినిమాకు మంచి హైప్ ఇస్తూ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

”చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

పవన్ కల్యాణ్‌గారితో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగాప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము.

వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం” అని అందులో పేర్కొన్నారు. ఈ మాట‌లు ప‌వ‌న్ అభిమానుల‌కు మంచి జోష్ ఇస్తూ సినిమా మీద అంచ‌నాలు పెంచుకునేలా చేస్తున్నాయి.