ఆర్మీపై చెత్త‌ కామెంట్.. లెంప‌లేసుకున్న న‌టి

లిబ‌ర‌ల్స్, ఇంట‌లెక్చువ‌ల్స్ అని ముద్ర వేయించుకున్న కొంద‌రు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాలో అదే ప‌నిగా న‌రేంద్ర మోడీ స‌ర్కారును టార్గెట్ చేస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఐతే వాళ్లు చేసే కామెంట్ల‌లో స‌హేతుకంగా అనిపించేవి ఉంటాయి. కొన్ని అతిగా అనిపిస్తాయి. ఐతే ఏ విష‌యంలో అయినా ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు చేస్తే ఓకే.

కానీ సున్నిత‌మైన విష‌యాల్లో త‌ల‌దూర్చి అతిగా అనిపించే కామెంట్లు చేస్తే ట్రీట్మెంట్ మామూలుగా ఉండ‌దు. త‌ప్ప‌యిపోయింద‌ని లెంప‌లేసుకున్నా కూడా ఫ‌లితం ఉండ‌దు. ఇప్పుడు బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా ప‌రిస్థితి ఇలాగే త‌యారైంది. తాజాగా నార్న‌ర్న్ ఆర్మీ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ ఉపేంద్ర ద్వివేది.. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను సొంతం చేసుకుంటామ‌ని, అందుకు ఇండియ‌న్ ఆర్మీ సిద్ధంగా ఉంద‌ని ఒక ట్వీట్ చేశారు.

దానికి బ‌దులుగా.. రిచా గాల్వాన్ సేస్ హాయ్ అని ట్వీట్ చేసింది. మామూలుగా ఈ కామెంట్ చూస్తే ఏ పాకిస్థానీనో, చైనీయులో ట్వీట్ చేసి ఉంటార‌ని అనుకుంటాం. ఎందుకంటే గాల్వాన్ వాలీలో చైనా సైనికుల‌తో పోరాడి భార‌తీయ సైనికులు 28 మంది దాకా ప్రాణాలు వ‌ద‌ల‌డం ఒక చేదు జ్ఞాప‌కం.

దేశం కోసం అంత‌మంది సైనికులు వీర మ‌ర‌ణం పొందితే దాన్ని గుర్తు చేస్తూ ఇండియ‌న్ ఆర్మీకి కౌంట‌ర్ వేయ‌డం ఎంత దారుణం? అందుకే రిచా మీద ఆ వ‌ర్గం ఈ వ‌ర్గం అని తేడా లేకుండా అంద‌రూ విరుచుకుప‌డిపోయారు. ఆమెకు గ‌ట్టిగా గ‌డ్డి పెట్టారు. ఐతే తాను చేసింది ఎంత పెద్ద త‌ప్పో గుర్తుకు వ‌చ్చి రిచా త‌ర్వాత ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. త‌న తండ్రి, మామ సైన్యంలో ప‌ని చేశార‌ని.. దేశ‌భ‌క్తి అనేది త‌న ర‌క్తంలో ఉంద‌ని.. ఎవ‌రైనా బాధించి ఉంటే మ‌న్నించాల‌ని.. ఇలా వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించింది. అయినా కూడా ఆమె మీద నెటిజ‌న్ల దాడి ఆగ‌ట్లేదు.