ఛాన్సులు వదిలేస్తున్న ఏజెంట్

ఆ మధ్య ఏదో ఆర్భాటంగా సంక్రాంతి విడుదలని ఒక పోస్టర్ రిలీజ్ చేయడం తప్ప ఏజెంట్ నుంచి ఎలాంటి కదలిక లేదు. ఆ సీజన్ లో వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడులతో తలపడే అవకాశం లేదని తెలిసి కూడా నిర్మాత అనిల్ సుంకర ఆ ప్రకటన చేయడం వెనుక అంతరార్ధం అక్కినేని ఫ్యాన్స్ కు అర్థం కానిదేం కాదు.

ప్రమోషన్లు అప్డేట్లు లేవని గోల పెడుతున్న టైంలో ఏదో కంటితుడుపుగా అలా వదిలారే తప్పించి అంతకు మించి కారణం లేదు. సరే జరిగిందేదో జరిగింది కనీసం ఫిబ్రవరిలో అయినా వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే ఆ నెల 16న మహాశివరాత్రిని టార్గెట్ చేయొచ్చని అనుకున్నారు.

తీరా చూస్తా గతంలో ధనుష్ సర్ ని 17కి లాక్ చేస్తే తాజాగా విశ్వక్ సేన్ ధమ్కీ కూడా అదే డేట్ కి క్లాష్ కి రెడీ అవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న అన్నీ మంచి శకునములే సైతం రేస్ లో దిగేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఏజెంట్ రాదని కన్ఫర్మ్ చేసుకున్నాకే విశ్వక్ ధమ్కీని డిసైడ్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది.

ఒంటిని మనసును బాగా కష్టపెట్టి అఖిల్ చేసిన ప్యాన్ ఇండియా మూవీకి ముందు నుంచి అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ జాప్యం ఒకసారి, సాంకేతిక కారణాలు మరోసారి, ఇలా ఏవో ఒక అడ్డంకులతో నెలల తరబడి విడుదలను ఆపుతునే వస్తున్నాయి.

ఈ లెక్కన ఏజెంట్ ఫిబ్రవరిలో రావడం అనుమానమే. అదే జరిగితే సైలెంట్ అయిపోయి శుభ్రంగా 2023 సమ్మర్ కు రావడం ఉత్తమం. ఏప్రిల్ లో అనిల్ సుంకరదే భోళా శంకర్ ఉంది కాబట్టి అదొక్కటి మినహాయించి ఇంకో తేదీకి వెళ్లాల్సి ఉంటుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ లో అఖిల్ తో పాటు మమ్ముట్టి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ అఖిల్ మార్కెట్ ని మించి చాలా ఖర్చు పెట్టారు. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ ఇలా పదే పదే పోస్ట్ పోన్ లు చేయడం వల్ల ఉన్న హైప్ మీద ప్రభావం పడుతుంది.