వయసు మీద పడింది. సినిమాలు సరిగా ఆడట్లేదు. పైగా రాజకీయాల వైపు అడుగులు వేశాడు. దీంతో కమల్ హాసన్ కథ కంచికే అని అంతా అనుకున్నారు కొన్నేళ్ల ముందు. కానీ రాజకీయాల్లో ఫెయిలై తిరిగి సినిమాలవైపు అడుగులు వేశాడు కమల్. కెరీర్ దాదాపు ముగిసిందనుకున్న దశ నుంచి పుంజుకుని, ఏడు పదుల వయసుకు దగ్గర పడుతున్న తరుణంలో విక్రమ్ సినిమాతో కమల్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ప్రభంజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆ సినిమాతో అనేక కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన కమల్.. ఆ ఊపులో అదిరిపోయే సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే.
దాని తర్వాత ఖాకి, వలిమై, తునివు లాంటి సినిమాలు తీసిన హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు లోకనాయకుడు. అది వచ్చే ఏడాది ఆరంభంలో మొదలవుతుంది. ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కమల్ సినిమా చేయబోతున్న విషయాన్ని ఇటీవలే ప్రకటించారు. కానీ ముందు వినోద్ సినిమానే పట్టాలెక్కనుంది. విశేషం ఏంటంటే.. ఈ రెండు చిత్రాల తర్వాత కమల్ చేయబోయే ఇంకో మూడు సినిమాల గురించి అప్పుడే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మలయాళ దర్శకుడు మహేష్ నారాయణన్‌తో కమల్ ఓ సినిమా కమిటై ఉన్నాడు. అది ఆయన సొంత బేనర్లో తెరకెక్కుతుంది. అది కాక పా.రంజిత్, వెట్రిమారన్ లాంటి విలక్షణ దర్శకులతోనూ కమల్‌కు కమిట్మెంట్లు ఉన్నాయట. ఈ వయసులో ఇదేం లైనప్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates