స‌మంత సినిమాకు భ‌లే ఫెసిలిటీ

ఓటీటీల్లో ఈ మ‌ధ్య ఏ కొత్త సినిమా రిలీజైనా వేర్వేరు భాష‌ల్లో ఆడియో అందుబాటులో ఉంటోంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ‌య్యే సినిమాల‌కు మామూలుగానే ఆయా భాష‌ల ఆడియోను జ‌త చేస్తారు. అలా కాకుండా ఏదో ఒక్క భాష‌లోనే తెర‌కెక్కిన సినిమాకు కూడా ఓటీటీలు ప్ర‌త్యేకంగా ఆడియోను జోడిస్తున్నాయి. ఏ భాష‌లో కావాలంటే ఆ భాష‌లో సినిమాను చూసుకునే సౌల‌భ్యం ల‌భిస్తోంది.

ఐతే థియేట‌ర్ల‌లో కూడా ఇలా మ‌న‌కు న‌చ్చిన భాష‌ను సెల‌క్ట్ చేసుకుని చూసుకునే అవ‌కాశం ఉంటే ఎలా ఉంటుంది? ఈ టెక్నాల‌జీ ఇప్పుడు అందుబాటులోకి వ‌స్తోంది. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ య‌శోద‌కు ఈ సౌల‌భ్యం ఉండ‌డం విశేషం. ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజైంది. ఐతే హిందీలో సినిమా చూడాలంటే హిందీ వెర్ష‌న్ ఆడుతున్న థియేట‌ర్‌కే వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు వెర్ష‌న్‌కే వెళ్లినా హిందీ ఆడియోతో సినిమా చూడొచ్చు.

ఐతే ఇందుకు హెడ్‌సెట్‌తో పాటు మొబైల్లో సినీ డ‌బ్స్ అనే యాప్ అందుబాటులో ఉండాలి. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని.. చూడ‌బోతున్న సినిమా, మ‌నం వెళ్లిన థియేట‌ర్‌, స‌మ‌యం అన్నీ ఎంట‌ర్ చేసి లాంగ్వేజ్ సెల‌క్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిగ్గా సినిమాకు త‌గ్గ‌ట్లుగా ఆడియో సింక్ అయిపోతుంది. బిగ్ స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తూ.. హెడ్ సెట్‌లో ఆడియో వింటూ మ‌న‌కు న‌చ్చిన భాష‌లోనే సినిమాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

య‌శోద సినిమాకు ఈ సౌల‌భ్యం ఉన్న విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. జ‌నం దీనికి అల‌వాటు ప‌డితే మున్ముందు ఇది ఒక ట్రెండ్‌గా మారే అవ‌కాశాలు లేక‌పోలేదు. అది ప్రేక్ష‌కుల‌కు మంచి అనుభ‌వం అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. త‌మిళ ద‌ర్శ‌కులు హ‌రి-హ‌రీష్ క‌లిసి రూపొందించిన య‌శోద‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌నే వ‌స్తోంది.