ఆచార్య ఫెయిల్యూర్‌పై చ‌ర‌ణ్ కామెంట్

ఆచార్య‌.. మెగాస్టార్ చిరంజీవికి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌కు త‌మ కెరీర్ల‌లోనే అత్యంత చేదు అనుభ‌వాన్ని మిగిల్చిన సినిమా. ఈ త్రండీ కొడుకుల క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన సినిమా మెగా అభిమానుల‌కు ఒక తీపి గుర్తుగా ఉంటుంద‌నుకుంటే.. అది కాస్తా చేదు జ్ఞాప‌కంగా మారింది. ఈ ఫెయిల్యూర్ గురించి చిరంజీవి రెండుమూడు సంద‌ర్భాల్లో చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అయ్యాయి.

త‌ప్పందా ద‌ర్శ‌కుడు కొర‌టాల‌దే అన్న‌ట్లు ఆయ‌న మాట్లాడ‌డం ఆయ‌న మీద నెగెటివిటీని తెచ్చిపెట్టింది. ఐతే త‌ర్వాత చిరు త‌న వ్యాఖ్య‌ల‌ను స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఐతే ఇప్ప‌టిదాకా రామ్ చ‌ర‌ణ్ అయితే ఆచార్య ఫెయిల్యూర్ గురించి ఎక్క‌డా మాట్లాడింది లేదు. హిందుస్థాన్ టైమ్స్ ఏటా నిర్వ‌హించే లీడ‌ర్ షిప్ స‌మ్మిట్‌లో పాల్గొన్న చ‌ర‌ణ్.. ఆచార్య పేరెత్త‌కుండా దాని గురించి మాట్లాడాడు.

ఆర్ఆర్ఆర్ భారీ స‌క్సెస్ అయ్యాక త‌న నుంచి ఒక స్మాల్ రిలీజ్ జ‌రిగింద‌ని.. అందులో తాను అతిథి పాత్ర చేశాన‌ని.. కానీ ఆ సినిమా చూసేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాలేద‌ని చ‌ర‌ణ్ వ్యాఖ్యానించాడు. ప్రేక్ష‌కులు కంటెంట్ బాగుంటేనే చూస్తారు, థియేట‌ర్ల‌కు వ‌స్తారు అన‌డానికి ఇది రుజువ‌ని.. విష‌యం లేకుంటే ఎలాంటి హీరో న‌టించినా చూడ‌ర‌ని చ‌ర‌ణ్ తేల్చేశాడు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్‌లో త‌న ఇంట్రో సీన్‌కు ప‌డ్డ క‌ష్టం గురించి వివ‌రించాడు.

ఆ స‌న్నివేశం చిత్రీక‌ర‌ణ‌కు 35 రోజులు ప‌ట్టింద‌ని.. చిన్న‌త‌నంలోనే డ‌స్ట్ అల‌ర్జీ కార‌ణంగా స‌ర్జ‌రీ కూడా చేయించుకున్నాన‌ని.. అలాంటి వాడిని విప‌రీత‌మైన దుమ్ము, వేల మంది మ‌నుషుల మ‌ధ్య 35 రోజుల పాటు ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని.. ఆ స‌న్నివేశం అద్భుతంగా రావ‌డానికి రాజ‌మౌళే కార‌ణ‌మ‌ని చ‌ర‌ణ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా చ‌ర‌ణ్.. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి రంగ‌మ్మా మంగ‌మ్మా, తూ చీజ్ బ‌డీ హై పాట‌ల‌కు స్టెప్పులేయ‌డం విశేషం.