20 రోజుల గడువుతో థియేటర్లకు ఎసరు

జనం అసలే థియేటర్లకు రావడం తగ్గించారు. ఏదో విజువల్ గ్రాండియరో లేదా అదిరిపోయే కంటెంటో ఉంటే తప్ప టికెట్లు కొని ఏం చూస్తాంలే ఇంట్లోనే ఉందామనే ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. ఇదే విషయంగా మూడు నెలల క్రితం నిర్మాతల క్రితం స్ట్రైక్ చేసి మరీ చర్చోపచర్చలు చేశారు. నష్టం వస్తున్నా సరే షూటింగులు ఆపి నిర్మాతలు దానికి సహకరించారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఓటిటికి సంబంధించి ఎనిమిది వారాల గ్యాప్ ని తప్పనిసరి చేశారు. కానీ ఒకవేళ దాన్ని పాటించకపోతే ఉండే పరిణామాలు మాత్రం బయటికి చెప్పలేదు.

కట్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ సీన్ వేరేలా ఉంది. పట్టుమని ఇరవై రోజులు దాటడం ఆలస్యం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ పేరుతో కొత్త సినిమాలు స్మార్ట్ స్క్రీన్ పైకి వచ్చేస్తున్నాయి. హఠాత్తుగా ఊడిపడ్డట్టు ఓరి దేవుడా ప్రకటన ఉదయం ఇచ్చేసి పదకొండో తేదీ నుంచే స్ట్రీమింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేశారు. ఓటిటి పార్ట్ నర్ ఆహా అని తెలుసు కానీ మరీ ఇంత త్వరగా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. గతంలో స్వాతిముత్యంని కూడా ఇదే తరహాలో దీపావళి కానుకంటూ నాలుగో వారం రాకుండానే ఆడియన్స్ ఇళ్లకు పంపించారు. నాగార్జున ది ఘోస్ట్ ది సైతం అదే కథ.

డీసెంట్ టాక్ తెచ్చుకున్న వాటిని ఇలా త్వరపడి ఓటిటిలో వేస్తే  థియేటర్ రిలీజ్ టైంలో యావరేజ్ అనే మాట విన్న జనాలు థియేటర్ కు ఎందుకు వస్తారు. అదేదో పది రోజులు ఆగితే హ్యాపీగా కాలు కదలకుండా చూడొచ్చు కదాని రిలాక్స్ అవుతారు. గాడ్ ఫాదర్ కూడా ఎర్లీ స్ట్రీమింగ్ కి ప్రయత్నించి నెట్ ఫ్లిక్స్ అదనపు మొత్తం ఇవ్వడానికి ఒప్పుకోలేదన్న టాక్ కూడా ఉంది. అందుకే నలభై రోజుల తర్వాత ఈ 18న వస్తోంది. ఏది ఏమైనా ఈ ఇష్యూ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. లేకపోతే ఆడియన్స్ లో నిర్లిప్తత ఇంకా పెరిగిపోయి ఇకపై ఓపెనింగ్స్ కి గండి పడుతుంది.