అడిగినోళ్ళకి చెయ్యట్లేదు.. కోరుకున్నోళ్ళు రావట్లేదు

మొండితనం.. దీనికో లిమిట్ ఉంటేనే బాగుంటుంది. మరీ ఓవర్ గా వెళిపోయినా కూడా గట్టిగా ఎదురుదెబ్బ తగిలే ఛాన్సుంటుంది. ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాథ్‌ పరిస్థితి కూడా దీనికి దగ్గరగానే ఉందంటున్నారు సన్నిహితులు. డబ్బులు ఎంతపోయినా కూడా ఏదో ఒక కమర్షియల్ సినిమాతో పూరి చాలాసార్లు గట్టెక్కేశాడు. అయితే ఇప్పుడు కెరియర్ ప్రశ్నార్ధకంలో పడుతున్న టైములో మాత్రం.. ఇంకా మొండిగానే ఉంటానంటున్నాడు. పదండి ఆ కథాకమామీషూ ఏంటో చూద్దాం.

నిజానికి లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. మినిమం గ్యారంటీ సినిమా అయినా అవుతుందిలే అనుకున్నారంతా. కాని పూరి జగన్ మాత్రం, సెకండాఫ్‌‌ను ఒక రకంగా తీసి, ఆడియన్స్‌ను హింసించేశాడు. అయినాసరే పూరి జగన్‌తో కలసి పనిచేయడానికి చాలామంది స్టార్ హీరోస్ రెడీగానే ఉన్నారు. ఒక లైవ్ చాట్‌లో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా కథ తీసుకురమ్మని చెప్పారు. అయితే ఇలా ఆయన్ను అడిగినోళ్ళకి ప్రస్తుతం సినిమా చేసే ప్లాన్‌లో లేడంట మన పోకిరి డైరక్టర్. ఒక ప్యాన్ ఇండియా సినిమా తీసి ఫ్లాప్ అయ్యాడు కాబట్టి, మరో ప్యాన్ ఇండియా సినిమాతో హిట్టు కొట్టేసి తన సత్తాచాటాలని చూస్తున్నాడట. అందుకే బాలీవుడ్‌లో మకాం వేసి.. అక్కడ సల్మాన్ ఖాన్, కార్తిక్ ఆర్యన్ వంటి హీరోల కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో తెలుగులో హిట్టయిన సినిమాలు రీమేక్ చేస్తే బాలీవుడ్ ఆడట్లేదు. అలాగే అక్కడే సినిమాలు తీసిన క్రిష్‌, గౌతమ్ తిన్ననూరి వంటి తెలుగు డైరక్టర్లు కూడా పెద్దగా ప్రూవ్ చేసుకోలేకపోయారు. మొన్ననే విక్రమ్‌వేద సినిమాను మళ్ళీ తీసి తమిళ డైరక్టర్స్ కూడా ఫ్లాప్ అయ్యారు. ఈ సమయంలో పూరి జగన్ కథను నమ్మి ఆయనకు ఏ హీరో డేట్స్ ఇస్తాడనేది చూడాల్సిన విషయమే. కాకపోతే ఇప్పటివరకు ఆయన కోరుకున్న ఒక్క బాలీవుడ్ హీరో కూడా కథ వినడానికి సుముఖత చూపలేదని తెలుస్తోంది.