పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ఆయన తన అభిమాన నటుడని పలు సందర్భాల్లో చెప్పుకున్న పవన్… ఆయన సినిమాలు తననెంతగా అలరించాయో కూడా చెప్పాడు.
ఇప్పుడు పవన్ అరాధ్య నటుడు కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. నిన్న రాత్రి నుంచి ఇండియాలో ఇదే అతి పెద్ద వార్త. అమితాబ్‌తో పాటు ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆద్య కూడా కరోనా బాధితులుగా మారారు. ఐశ్వర్య, ఆద్యలకు కరోనా అని లేటుగా తెలిసింది. ఈ లోపు పవన్ అమితాబ్, అభిషేక్‌ల గురించి ఆవేదనతో ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టాడు.
కూలీ సినిమా షూటింగ్ సందర్భంగా అమితాబ్ పెద్ద ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరినపుడు తన తల్లిదండ్రులతో పాటు కుటుంబంలో అందరూ ఆయన కోసం ప్రార్థించారని.. అన్ని తరాల వారినీ అభిమానులుగా మార్చుకున్న వ్యక్తి అమితాబ్ అని.. అమితాబ్‌ను అందరూ కేవలం నటుడిగా మాత్రమే కాక ఆయన పోరాటతత్వం, అణకువ, సింప్లిసిటీ చూసి ఎక్కువ ఇష్టపడతారని.. అమితాబ్‌కు, అభిషేక్‌కు కరోనా అని తెలియగానే తనకు విపరీతమైన బాధ కలిగిందని.. వీళ్లిద్దరూ త్వరగా కోలుకునేలా దేవుడు చూస్తాడని ఆశిస్తున్నానని పవన్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కు హీరోయిన్ పూజా హెగ్డే స్పందిస్తూ.. అమితాబ్ విషయంలో తన ఫీలింగ్స్ కూడా డిట్టో ఇలాగే ఉన్నాయని.. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates