20 రోజులైనా ఆగని కాంతార రికార్డులు

ఒక కన్నడ డబ్బింగ్ సినిమా ఇరవై రోజుల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రిలీజ్ బలంగా కొనసాగిస్తోందంటే అది ఏ స్థాయి బ్లాక్ బస్టరో అర్థం చేసుకోవచ్చు. మొన్న ఏకంగా తొమ్మిది రిలీజులున్నా సరే వాటికి ధీటుగా నిలవడం చూస్తే టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగా ఒన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ నుంచే 48 కోట్ల గ్రాస్ 25 కోట్ల షేర్ దాటడమంటే మాటలు కాదు. ఓవర్సీస్ లో కెజిఎఫ్ 2 తర్వాత సగర్వంగా 2 మిలియన్ మార్క్ అందుకున్న రెండో శాండల్ వుడ్ మూవీగా కాంతార మరో రికార్డుని ఖాతాలో వేసుకుంది. అలా అని ఇంకా నెమ్మదించలేదు.

ఇప్పటికీ వీకెండ్స్ కాంతార కంట్రోల్ లోనే ఉన్నాయి. ఊర్వశివో రాక్షసివోకు పాజిటివ్ టాక్ వచ్చినా దాని ప్రభావం మరీ సీరియస్ గా పడే సూచనలు కనిపించడం లేదు. మిగిలినవన్నీ మూడు రోజుల తర్వాత టపా కట్టే దిశగానే వెళ్తున్నాయి. వాటిలో చాలా మటుకు నెగటివ్ షేర్లు నమోదు చేస్తున్నాయి. వారాంతంలో ఏ సినిమాకు వెళదామని చూసుకుంటే ఫస్ట్ టూ బెస్ట్ ఛాయస్ లో కాంతారకు ఖచ్చితంగా స్థానం ఉంటుంది. అటు హిందీలోనూ మిలి, ఫోన్ భూత్ లాంటి కొత్త చిత్రాల తాకిడి కాంతారను దెబ్బ కొట్టలేకపోయాయి. హీరో దర్శకుడు రిషబ్ శెట్టి ఏకంగా ఇండియా గేట్ కు వెళ్లి మరీ ప్రమోషన్ చేస్తున్నాడు.

ఇంకో పన్నెండు రోజుల్లో కాంతార ఓటిటి ప్రీమియర్ నవంబర్ 18 ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. ముందు 4నే అన్నారు కానీ తర్వాత నిర్ణయం మారినట్టుగా తెలుస్తోంది. దసరా నుంచి చెప్పుకోదగ్గ సినిమాలు ఏ భాషలోనూ రాకపోవడం కాంతారకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయ్యింది. దీని స్థాయి సక్సెస్ ఇంకో మూవీ దేనికైనా వచ్చి ఉంటే అప్పుడా ప్రభావం వేరుగా ఉండేది కానీ నక్కతోక తొక్కిన హోంబాలే ఫిలింస్ కి ఇరవై కోట్ల లోపే తీసిన ఈ విలేజ్ డ్రామా కామధేనువుగా మారిపోయింది. కర్ణాటకలో కెజిఎఫ్ ని మించిపోయి అత్యధిక ఫుట్ ఫాల్స్ నమోదు చేసుకున్న కాంతార ఫైనల్ రన్ లోపు ఇంకేమేం చేయనుందో.