బన్నీ వాసు.. అల్లు అరవింద్‌ కన్నా ఎక్కువట

అల్లు అరవింద్ టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్లలో ఒకడు. ఆయన తరం నిర్మాతలందరూ సినిమాలు మానేసి, ప్రొడక్షన్ హౌస్‌లు మూసేసి సైలెంట్ అయిపోయినా.. ఆయన మాత్రం ఇంకా చాలా యాక్టివ్‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. మిగతా నిర్మాతల్లా ఆయన ఔట్ డేట్ కాకుండా, ట్రెండీగా సినిమాలు తీస్తుండడానికి తన చుట్టూ ఉన్న యంగ్ టీం ఒక కారణం.

ఆ టీంలో బన్నీ వాసు అత్యంత ముఖ్యుడు. మామూలుగా పెద్ద నిర్మాతలు ఎవ్వరైనా సరే.. తమ తర్వాత కొడుకులకో, కూతుళ్లకో లేదంటే ఇతర కుటుంబ సభ్యులకో ప్రొడక్షన్ హౌస్‌లు అప్పగిస్తుంటారు. కానీ అరవింద్ మాత్రం బయటి వ్యక్తి అయిన అల్లు అర్జున్ మిత్రుడు బన్నీ వాసుకు ప్రొడక్షన్ బాధ్యతలు ఇచ్చాడు. ఆయనేమీ పక్కకు తప్పుకోలేదు కానీ.. గీతా ఆర్ట్స్-2 సినిమాల బాధ్యతలన్నీ చూసేది బన్నీ వాసే. గీతా ఆర్ట్స్ సినిమాల్లో సైతం అతడి పాత్ర కీలకం.

బన్నీ వాసు విషయంలో ఏమాత్రం ఇన్ సెక్యూర్ ఫీలింగ్ లేకుండా అరవింద్ అయినా, బన్నీ అయినా తన గురించి ఇచ్చే స్టేట్మెంట్లు.. అలాగే అరవింద్, బన్నీల గురించి బన్నీ వాసు చెప్పే మాటలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్ మీట్లో భాగంగా బన్నీ వాసు ఒక కీలక విషయం గురించి మాట్లాడాడు. అల్లు శిరీష్ హీరో కావడం అన్నది చాలా పెద్ద నిర్ణయం అని.. అతను హీరో అయ్యాడు కాబట్టే అతనుండాల్సిన స్థానంలో తాను ఉన్నానని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. మామూలుగా అయితే అరవింద్ వారసుడిగా ఆయన ప్రొడక్షన్ హౌస్‌లు చూసుకోవాల్సింది శిరీష్ అని.. కానీ అతను హీరో కావడంతో తాను ఆ బాధ్యతలు చేపట్టానని చెప్పకనే చెప్పాడు వాసు. ఈ సందర్భంగా బన్నీ తనవాడని.. తాను బన్నీ వాడినని కూడా అన్నాడు. బన్నీ సంపాదించిందంతా తాను సంపాదించినట్లే అని.. అతను ఎంత ఎదిగితే తాను అంత ఎదిగినట్లే అని అన్నాడు. ఆ తర్వాత బన్నీ మాట్లాడుతూ.. వాసు చెప్పింది అక్షర సత్యం అని.. తామిద్దరం వేరు కాదని అన్నాడు. తన ఎదుగుదలలో తండ్రి అరవింద్ కంటే కూడా కొంచెం ఎక్కువ క్రెడిట్ వాసుకే ఇస్తానని.. గీతా ఆర్ట్స్‌లో ఎప్పుడు సినిమా చేసినా, తన తండ్రి తనకు ఎంత పారితోషకం ఇవ్వాలా అని లెక్కలు వేసుకుంటాడని.. కానీ వాసు మాత్రం ఆయన అనుకున్నదానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తనకు ఇవ్వాలని చూస్తాడని బన్నీ పేర్కొనడం విశేషం.