విజయ్‌తో గోవిందం.. రష్మిక కూడా రిపీటేనా?

హీరోగా పెళ్ళిచూపులు సినిమాతో అలరించి.. అర్జున్ రెడ్డితో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించి.. గీతా గోవిందం సినిమాతో భారీ బాక్సాఫీస్ కలక్షన్లు రాబట్టగలనని నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ ఆడకపోయినా కూడా.. ఇప్పటికీ తన క్రేజును మాత్రం అలాగే కొనసాగిస్తున్నాడు. అయితే లైగర్ సినిమా ఫ్లాపైన తరువాత.. ఖుషీ సినిమా ముస్తాబవుతున్నా కూడా.. ఈసారి మాత్రం చాలా కేర్ఫుల్ గా ఒక రొమాంటిక్ కామెడీతో రావాలని యోచిస్తున్నాడట. ఈ తరుణంలో ఒక ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది.

గీత గోవిందం సినిమాను తీసిన దర్శకుడు పరశురాం ఆ తరువాత మహేష్ బాబుతో ‘సర్కారువారి పాట’ అంటూ ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టయినర్ తో విచ్చేశాడు. సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా.. మహేష్‌ స్టార్డమ్ వలన భారీ కలక్షన్లు వచ్చేశాయి. కాకపోతే ఈ సినిమా కంటెంట్ చూశాక.. పరశురామ్ తో సినిమా చేయాల్సిన నాగచైతన్య ఈ ప్రాజెక్ట్ పక్కనపెట్టి వెంకట్ ప్రభు సినిమాను లైన్లో పెట్టేశాడు. ఇక పెద్ద హీరోల డేట్స్ లేకపోవడంతో.. మరోసారి విజయ్ దేవరకొండతో చేతులుకలపాలని పరశురాం ఒక ఆసక్తికరమైన కథను తీసుకురాగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాతో జతకట్టాలని యోచిస్తున్నాడట విజయ్. ఓ విధంగా చూస్తే ఇది ‘గీత గోవిందం 2’ అవుతుందని చెప్పాలి.

ఆల్రెడీ గీతా గోవిందం తరువాత డియర్ కామ్రేడ్ సినిమా కోసం విజయ్ అండ్ రష్మిక జంటగా ముందుకొచ్చారు కాని, ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో నిరాశ చెందారు. ఈ మధ్యనే ఇద్దరూ కలసి ‘ఫ్రెండ్స్’ అంటూనే మాల్డీవ్స్ హాలిడేస్ కు వెళ్ళిరావడంతో.. ఈ జంటపై మీడియా అటెన్షన్ మరియు ఆడియన్స్ కి కుతూహలం కూడా బాగా పెరిగింది. చూద్దాం వీళ్ళు నిజంగానే జతకడతారో లేదో మరి.