నితిన్ సినిమా దానికీ నోచుకోలేదా

బాక్సాఫీస్ అన్నాక సూపర్ హిట్లు అట్టర్ ఫ్లాపులు సహజం. థియేటర్లో జనం చూడనంత మాత్రాన ఇక ఆ సినిమాకు లైఫ్ ఉండదని కాదు. ఓటిటిలో చూసేవాళ్ళు వేల నుంచి లక్షల్లో కరోనా వచ్చాక కోట్లలో పెరిగిపోయారు. బిగ్ స్క్రీన్ మీద మిస్ అయ్యాం కాబట్టి ఇంట్లోనే తాపీగా చూద్దామనుకునే వాళ్ళు ఉండబట్టే ఒక్కోసారి కంటెంట్ వీక్ గా ఉన్న మూవీస్ సైతం మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంటున్న దాఖలాలున్నాయి. అలాంటిది పేరున్న హీరో క్రేజీ హీరోయిన్ కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న ఒక ఫ్లాప్ బొమ్మ వంద రోజులకూ డిజిటల్ లో రాకపోవడం విచిత్రమే.

ఆగస్ట్ లో రిలీజైన నితిన్ మాచర్ల నియోజకవర్గం ఫలితం గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ ఇప్పటిదాకా దీని ఓటిటి ప్రీమియర్ జరగనే లేదు. కారణం ఏంటా అని ఆరాతీస్తే విడుదల ముందు నిర్మాత అనుకున్న రేట్ కి రిజల్ట్ వచ్చాక సదరు సంస్థ ఆఫర్ చేసిన మొత్తానికి భారీ వ్యత్యాసం ఉందట. నష్టాలను వీలైనంత దీని ద్వారా రికవరీ చేసుకుందామనుకున్న ప్లాన్ వర్కౌట్ కాలేదని వినికిడి. అందుకే ఇంత జాప్యం జరిగిందని అంటున్నారు. వంద రోజులు అవుతున్నా స్ట్రీమింగ్ కాకపోవడం వింతగానే చెప్పుకోవాలి. సీతారామం లాంటి బ్లాక్ బస్టరే నెల రోజులకు వచ్చింది.

ఇక్కడ కొన్ని అంశాలున్నాయి. ఏదైనా సినిమా ఒకవేళ ఓటిటి వాడు నేరుగా కొనే పరిస్థితి లేకపోతే వ్యూస్ మోడల్ లో పెట్టి వచ్చిన రెవిన్యూని షేర్ చేసుకోవడమనే ఆప్షన్ ఉంటుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిని ఇలాగే థర్డ్ పార్టీ ద్వారా ప్రైమ్ లో పెట్టారు. అందుకే అమెజాన్ తరఫున ఆ సినిమాకు ఎలాంటి యాడ్స్ మనకు కనిపించవు. స్టార్ హీరోలకు ఇలా జరగడం చాలా అరుదు. రెండు దశాబ్దాల యాక్టింగ్ కెరీర్ ఉన్న నితిన్ కు ఇలాంటి పరిస్థితి అంటే అనూహ్యమే. ప్రస్తుతం నా పేరు సూర్య ఫేమ్ వక్కంతం వంశీతో చేస్తున్న నితిన్ దానికి కూడా కొంత బ్రేక్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్.