టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మంగళవారం అక్కడి ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ విశిష్ఠ అతిథుల్లో ఒకడిగా పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. మంగళవారం కర్ణాటక దినోత్సవం కాగా.. ఈ సందర్భంగా దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక కర్ణాకట రత్న పురస్కారాన్ని ప్రదానం చేయబోతోంది కర్ణాటక ప్రభుత్వం.
ఈ కార్యక్రమానికి తారక్‌తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ సామాజిక వేత్త సుధామూర్తి విశిష్ఠ అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమంలో తారక్ పాల్గొంటాడన్నది పాత విషయమే. ఇందుకోసం అతను ఆల్రెడీ బెంగళూరుకు చేరుకున్నాడు. ఐతే మంగళవారం అన్ని ప్రధాన పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వం ఈ వేడుక గురించి ప్రకటనలు ఇచ్చింది.
ఇందులో పునీత్ రాజ్ కుమార్ ఫొటోను పెద్దగా ప్రచురించి.. ఆయనకు కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేసే కార్యక్రమంలో విశిష్ఠ అతిథులుగా హాజరవుతున్న రజినీ, తారక్, సుధామూర్తిల ఫొటోలను కింద ప్రచురించింది. ఇలా ఒక తెలుగు నటుడికి వేరే రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనల్లో ఇంత ప్రాధాన్యం దక్కడం విశేషంగా చెప్పుకోవాల్సిందే. ఇది తారక్‌కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవమే.
తారక్‌కు కర్ణాటకతో ఉన్న కనెక్షన్ గురించి అందరికీ తెలిసిందే. అతడి తల్లి కన్నడిగురాలు. అందుకే తారక్ కన్నడ కూడా అలవోకగా మాట్లాడతాడు. కన్నడనాటే జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్లో కన్నడలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నాడు తారక్. జూనియర్ గతంలో పునీత్ రాజ్‌కుమార్ కోసం ఒక సినిమాలో గెలయా గెలయా అంటూ కన్నడ పాట పాడడం కూడా విశేషం. మంగళవారం జరిగే కార్యక్రమంలోనూ తారక్ కన్నడలో ప్రసంగించి అలరిస్తాడనడంలో సందేహం లేదు.