అందరినీ ఏకం చేస్తున్న అల్లు అరవింద్!

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి మల్టీ బిలియన్ డాలర్ కంపెనీలు ఉన్న గ్రౌండ్లోకి దిగి ఆడాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే ఇండస్ట్రీలో ఉన్న అనుభవం, పలుకుబడితో తెలుగు సినిమా ఓటిటి కంటెంట్ వరకు రాబట్టవచ్చు అని అల్లు అరవింద్ పెద్ద గేమ్ ప్లాన్ లేకుండానే ఆహా మొదలు పెట్టేసారు.

వీలయినన్ని సినిమాల ఎక్స్క్లూజివ్ రైట్స్ కొనేయడంతో పాటు తగినన్ని ఒరిజినల్ సిరీస్ కూడా రెడీ చేసుకుని రంగంలోకి రావాల్సింది… పాత మెగా సినిమాలు పెట్టుకుని వచ్చేసారు. ఊహించినట్టుగానే ఆహా పోటీలో వెనుకబడిపోయింది. ఇంకా ఈ సంస్థ ఏ పెద్ద సినిమా హక్కులు పొందలేదు. ఇప్పుడిప్పుడే ఈ గేమ్ అర్థం చేసుకుంటున్న అల్లు అరవింద్ కంటెంట్ మీద ఫోకస్ పెట్టారు.

సినిమా నిర్మాణం అయితే ఒక్కసారి ఒక్క సినిమానే సెట్స్ మీద ఉంటుంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఉండదు. కానీ వెబ్ కంటెంట్ అలా కాదు. అంతా ఒక్కరే చూసుకోవడం కుదరదు. అందుకే వంశీ పైడిపల్లి, నందిని రెడ్డి, హరీష్ శంకర్, మారుతీ తదితరుల సాయం తీసుకుంటున్నారని సమాచారం. తాజాగా దిల్ రాజు కూడా అల్లు అరవింద్ కి జతగా వచ్చారట. ఆయన కూడా కంటెంట్ ప్రొడక్షన్ తో పాటు కంటెంట్ ఫైనల్ చేయడంలో పాత్ర పోషిస్తారట. టాలీవుడ్ ఏకమవుతున్న ఆహా మరి ఓటిటి జయంట్స్ ని ఎలా ఇరుకున పెడుతుందో చూడాలి.