ఆ హీరో అంతే.. సినిమాను ప్ర‌మోట్ చేయ‌డు

ఒక‌ప్పుడు పెద్ద హీరోల్లో చాలామంది త‌మ సినిమాల‌ను ప‌నిగ‌ట్టుకుని ప్ర‌మోట్ చేసేవారు కాదు. కానీ గ‌త ద‌శాబ్ద కాలంలో ట్రెండు మారిపోయింది. బాలీవుడ్లో టాప్ స్టార్ల‌యిన ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లు రోజులు, వారాల త‌ర‌బ‌డి త‌మ సినిమాల‌ను అగ్రెసివ్‌గా చేసే ప్ర‌మోష‌న్లు ఓపెనింగ్స్, ఓవ‌రాల్ వ‌సూళ్లు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని గ్ర‌హించి సౌత్ హీరోలంతా కూడా వారి బాట‌లో న‌డ‌వ‌డం మొద‌లుపెట్టారు.

మ‌హేష్ బాబు లాంటి రిజ‌ర్వ్డ‌గా ఉండే హీరో సైతం ప్రి రిలీజ్ ఈవెంట్ల‌లో పాల్గొన‌డ‌మే కాక.. ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాకు ఇంట‌ర్వ్యూలిస్తూ త‌న చిత్రాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం చూశాం. మిగ‌తా హీరోల సంగ‌తి చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న సినిమాల ప్ర‌మోష‌న్‌ను అస్స‌లు ప‌ట్టించుకోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ప్రి రిలీజ్ ఈవెంట్ల వ‌ర‌కు హాజ‌ర‌వుతుంటాడు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి ఒక‌టీ అరా సినిమాల‌కు మీడియా ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చాడు.

ఐతే త‌మిళ టాప్ స్టార్ అజిత్ కుమార్ మాత్రం ఇన్నేళ్ల‌లో ఏ సినిమానూ మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌మోట్ చేసింది లేదు. ఆడియో వేడుక‌లు, ప్రి రిలీజ్ ఈవెంట్ల ట్రెండ్ మొద‌ల‌య్యాక కూడా ఎప్పుడూ త‌న సినిమాకు ఏ వేడుకా చేయ‌నివ్వ‌లేదు. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఏవైనా ప్రెస్ మీట్లు, ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లు లాంటివి ప్లాన్ చేసినా అత‌ను మాత్రం రాడు.

ఐతే త‌న కొత్త చిత్రం తునివు విష‌యంలో అజిత్ ఆలోచ‌న మారింద‌ని, ఈ సినిమాను స్వ‌యంగా వ‌చ్చి ప్ర‌మోట్ చేయ‌బోతున్నాడ‌ని కొన్ని రోజులుగా మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి అజిత్ సైతం రూల్ బ్రేక్ చేస్తున్నాడ‌ని.. ప్ర‌మోష‌న్లో దిగుతున్నాడ‌ని ఒక‌టే హోరెత్తించేస్తోంది త‌మిళ మీడియా. కానీ ఈ ప్ర‌చారానికి అజిత్ ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ సురేష్ చంద్ర తెర‌దించేశాడు. ఒక మంచి సినిమా త‌న‌కు తానే ప్ర‌మోట్ చేసుకుంటుంది అనే అజిత్ చెప్పిన మాట‌ను అత‌ను ట్విట్ట‌ర్లో పోస్ట్ చేయ‌డం ద్వారా అజిత్ తునివు చిత్రాన్నే కాదు.. భ‌విష్య‌త్తులో కూడా మరే మూవీనీ ప్ర‌మోట్ చేయ‌డ‌ని చెప్ప‌క‌నే చెప్పేశాడు.