57 ఏళ్ల నటుడు.. 24 ఏళ్ల అమ్మాయితో

హాలీవుడ్లో 60-70 ఏళ్ల వయసున్న నటులు.. 20-30 ఏళ్ల అమ్మాయలతో రిలేషన్‌షిప్‌లో ఉండడం.. పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. ఐతే ఇండియన్ సొసైటీలో ఇలాంటివి తక్కువే. కొననేళ్ల ముందు బాలీవుడ్ సీనియర్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ 56 ఏళ్ల వయసులో.. తనకంటే 30 ఏళ్లు తక్కువ వయసున్న అంకిత కొన్వార్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఇదే బాటలో దక్షిణాది సీనియర్ నటుడు పృథ్వీ ఓ పడుచు అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

‘పెళ్లి’ సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించిన పృథ్వీకి ఇప్పుడు 57 ఏళ్లు కావడం గమనార్హం. ఆయన శీతల్ అనే 24 ఏళ్ల అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు స్వయంగా వెల్లడించాడు. నిజానికి పృథ్వీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై ఆయన స్పందించాడు. ఆమెతో ప్రస్తుతానికి రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నానని వెల్లడించాడు.

“నా రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తల్ని చూసి చాలామంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి విషయంలో వస్తున్న వార్తలు నిరాధారం. కానీ నేను శీతల్ అనే అమ్మాయితో రిలేషన్‌‌షిప్‌లో ఉన్న మాట వాస్తవం. ఆమె వయసు 24 ఏళ్లే. త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. నా మొదటి భార్య బీనాతో నాకు ఆరేళ్ల నుంచి గొడవలు ఉన్నాయి. దీంతో ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసి వేరుగా ఉంటున్నా. ఒంటరితనం మనిషిని కుంగుబాటుకు గురి చేస్తుంది. ఆ బాధను నేను అనుభవించా. అలాంటి సమయంలోనే శీతల్‌తో పరిచయం అయింది. ఆమె ఎంతో పరిణతి చెందిన వ్యక్తి మా అభిరుచులు కలిశాయి. స్నేహితులుగా మారాం. ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం” అని పృథ్వీ తెలిపాడు.

మరోవైపు శీతల్ మాట్లాడుతూ.. పృథ్వీకి, తనకు మధ్య వయసు అంతరం పెద్ద విషయం కాదని, వయసు ఒక అంకె మాత్రమే అని చెప్పింది. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లందరూ అంగీకరించినట్లు వెల్లడించింది.