రాజేంద్రుడి ప్రయాణం టాక్ ఏంటి

ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలకే ఓపెనింగ్స్ కోసం టెన్షన్ పడటం ప్రత్యక్షంగా చూస్తున్నాం. గాడ్ ఫాదర్ అయిదు రోజుల తర్వాత అమాంతం పడిపోయినా ది ఘోస్ట్ కు ఫస్ట్ డే హౌస్ ఫుల్స్ పడకపోయినా దానికి కేవలం చిరంజీవి నాగార్జున ఇమేజ్ లనే కారణంగా చూపలేం. మారుతున్న అభిరుచుల తాలూకు ఫలితమది. అలాంటిది నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, జనం దాదాపుగా మర్చిపోయిన నిన్నటి తరం జానపద కథానాయకుడు నరసింహరాజులను ప్రధాన పాత్రల్లో పెట్టి ఒక చిత్రం థియేట్రికల్ రిలీజ్ కు వెళ్లడమనేది పెద్ద సాహసం. అనుకోని ప్రయాణం నిన్న అనుకునే విడుదల చేసినా ఓపెనింగ్స్ మాత్రం రాలేదు.

కరోనా కాలం నాటి పరిస్థితులను తీసుకుని కొత్త దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల ఈ అనుకోని ప్రయాణాన్ని తెరకెక్కించారు. నిర్మాతే కథ రాసిచ్చారు కాబట్టి మార్పులు చేయడానికి వీలు కాలేదో లేక ఎప్పుడో ఆ నలుగురు తర్వాత అంత హై ఎమోషన్స్ ఉన్న సబ్జెక్టు రాజేంద్రుడు చేయలేదు కనక కుటుంబాలు విపరీతంగా చూసేస్తారన్న అంచనానో తెలియదు కానీ మొత్తానికీ సినిమాలో బలమైన కంటెంట్ అయితే మిస్ అయ్యింది. ఎక్కడో భువనేశ్వర్ లో కార్మికులుగా పనిచేస్తూ కరోనా వల్ల ఇద్దరు స్నేహితులు స్వగ్రామానికి బయలుదేరుతున్న క్రమంలో ఒకరు ప్రాణాలు కోల్పోతారు. శవాన్ని భుజాన వేసుకుని బ్రతికిన మరో మిత్రుడు చేసే ప్రయాణమే దీని కథ.

విపరీతమైన భావోద్వేగాలను సాగదీసిన స్క్రీన్ ప్లే ఫార్మాట్ లో చూసేందుకు ఆడియన్స్ అంతగా ఇష్టపడటం లేదు. అందులోనూ క్యారెక్టర్ ఆర్టిస్టులను మెయిన్ లీడ్ గా చూపిస్తే టికెట్లెలా కొంటారు. అనుకోని ప్రయాణానికి ఇవే ప్రధాన సమస్యలుగా మారాయి. కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే అతి నెమ్మదిగా సాగే కథా కథనాలతో డైరెక్టర్ వెంకటేష్ కాని రచయితలు పరుచూరి బ్రదర్స్ కాని కట్టిపడేసే విధంగా కంటెంట్ ని ప్రెజెంట్ చేయలేకపోయారు. అయినా జనాలు ఓటిటిలో ఇలాంటివి లెక్కలేనన్ని గతంలోనే చూశారు. మళ్ళీ ఇలా ప్రయాణాల పేరుతో చూపించాలంటే పల్లెవెలుగు బస్సు సరిపోదు.