గత ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా జరిగిన రభస అంతా తెలిసిందే. సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, వాదోపవాదాలు నడిచాయి ఆ సమయంలో. తీవ్ర ఉత్కంఠ రేపిన ఆ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఓటమి పాలైన ప్రకాష్ రాజ్.. మా సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాదు.. ఆయన ప్యానెల్లో వివిధ పదవులకు ఎన్నికైన వారు కూడా వాటికి దూరంగా ఉన్నారు.
కాగా ఇటీవలే మంచు విష్ణు అధ్యక్షుడిగా ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కీలకమైన ప్రకటన చేశాడు. తాము ఇచ్చిన హామీల్లో 90 శాతం పూర్తి చేశామని, ‘మా’ భవన నిర్మాణం కూడా పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ ప్రకటనపై తాజాగా ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూాలో మాట్లాడాడు.
‘మా అధ్యక్షుడిగా విష్ణు ఎన్నికై ఏడాదే అయిందని, ఆయన పని చేశారా లేదా అన్నది సభ్యులకు తెలుసని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించాడు. ఎన్నికైన వాళ్లు పని చేయాల్సిన బాధ్యత ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. ఇటీవల ‘మా’ కోసం విష్ణు ప్యానెల్ చేపట్టిన పనులను ప్రకటించారు కదా అని ప్రకాష్ రాజ్‌ను ప్రశ్నించగా.. “90 శాతం పనులు చేశామని ప్రకటన చేసినంత మాత్రాన ఆ పనులన్నీ చేసినట్లు కాదు. విష్ణు పదవీ కాలంలో ఇంకో సంవత్సరం ఉంది. ‘మా’ కోసం ఏం చేస్తారో చూద్దాం” అని ప్రకాష్ రాజ్ అన్నాడు.
వచ్చేసారి ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రకాష్ రాజ్‌ను ప్రశ్నించగా.. ‘‘ఇంకా సమయం ఉంది. ఆలోచిస్తాను’’ అంటూ నవ్వుతూ బదులిచ్చాడు విలక్షణ నటుడు. ప్రకాష్ రాజ్ మాటల్ని బట్టి చూస్తుంటే.. ‘మా’లో పరిణామాలను జాగ్రత్తగానే పరిశీలిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. సరైన సమయం వచ్చినపుడు ఆయన విష్ణు ప్యానెల్ మీద ఎటాక్ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
Gulte Telugu Telugu Political and Movie News Updates