జెనీలియా భర్త సాహసం

రితేష్ దేశ్‌ముఖ్ రెండు దశాబ్దాలకు పైగా సినిమాలు చేస్తున్నాడు. కానీ కెరీర్లో చాలా కాలం మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కొడుకుగా.. జెనీలియా భర్తగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. రితేష్ కెరీర్లో కొన్ని హిట్లున్నప్పటికీ.. అతడి నటనకు ప్రశంసలు రావడం.. ఒక సినిమా అతడి వల్లే హిట్ అయింది అనే గుర్తింపు రావడం పెద్దగా జరగలేదు. అయినా అలుపెరగకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

కొన్నేళ్లుగా హిందీలో సినిమాలు చేస్తూనే తన మాతృభాష మరాఠీలో సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు రితేష్. తాజాగా అతను మరాఠీలో ‘వేద్’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఐతే రితేష్ మరాఠీలో సినిమా చేస్తే ఏంటంట అంటారా? ఇందులో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి.

రితేష్ ‘వేద్’ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. అంతే కాక ఇందులో జెనీలియా అతడికి జోడీగా నటిస్తోంది. ఈ మధ్య బాలీవుడ్లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మంతో ముడిపడ్డ సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. ‘వేద్’ అనే టైటిల్, ఈ సినిమా ఫస్ట్ లుక్ అదీ చూస్తే.. రితేష్ కూడా ట్రెండును ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది.

నటుడిగా అంత పేరు తెచ్చుకోని రితేష్.. దర్శకుడిగా ఏమాత్రం మెరుపులు మెరిపిస్తాడో చూడాలి. ఇక పెళ్లి తర్వాత కొన్నేళ్ల పాటు కుటుంబం, పిల్లల బాధ్యతల్లో మునిగిపోయిన జెన్నీ.. ఇటీవలే మళ్లీ ముఖానికి రంగేసుకుంది. ఆల్రెడీ బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్న జెన్నీ.. మరాఠీలో భర్తతో కలిసి సినిమాకు రెడీ అయింది. మరి ఈ భార్యాభర్తలకు తమ మాతృభాషలో ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.