మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ మోహన్ లాలే అని చెప్పక తప్పదు. మమ్ముట్టి కూడా లాల్‌కు ఏమాత్రం తీసిపోని సూపర్ స్టారే కానీ.. వసూళ్ల పరంగా మాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నెలకొల్పేది.. బద్దలు కొట్టేది లాలెట్టనే. ‘దృశ్యం’తో తొలి 50 కోట్ల మూవీని.. ‘పులి మురుగన్’తో తొలి 100 కోట్ల మూవీని మలయాళ సినీ పరిశ్రమకు అందించింది మోహన్ లాలే. ‘లూసిఫర్’తో కొన్నేళ్ల కిందట ‘పులి మురుగన్’ రికార్డులను కూడా లాల్ బద్దలు కొట్టాడు. బడ్జెట్ల విషయంలోనూ లాల్ ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను టచ్ చేస్తుంటాడు.
ఐతే ఆయనకు ‘లూసిఫర్’ తర్వాత వరుసగా బాక్సాఫీస్ దగ్గర షాకులు తగులుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన బిగ్ బ్రదర్, మరక్కార్, ఆరట్టు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇందులో ‘మరక్కార్’ వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా. బాహుబలికి దీటైన సినిమాగా మలయాళ సినీ పరిశ్రమ ప్రమోట్ చేసిన ఈ చిత్రం విడుదలకు ముందే జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది కానీ.. థియేటర్లలో రిలీజయ్యాక ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆరట్టు’ కూడా తుస్సుమనిపించింది.
దృశ్యం-2, బ్రో డాడీ, ట్వల్త్ మ్యాన్ లాంటి చిత్రాలు ఓటీటీలో విడుదలై మంచి స్పందనే తెచ్చుకున్నప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్‌తో లాల్ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. లాల్‌తో ‘పులి మురుగన్’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన వైశాఖ్.. ఆయనతో తీసిన ‘మాన్‌స్టర్’ ఆ కోరిక నెరవేరుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. పూర్ ఓపెనింగ్స్‌తో తీవ్రంగా నిరాశ పరుస్తోంది. గత కొన్నేళ్లలోఅతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న లాల్ చిత్రంగా ‘మాన్‌స్టర్’ నిలుస్తోంది.
తొలి రోజు కనీసం ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడలేదు. ట్రైలర్‌తోనే తీవ్రంగా నిరాశ పరిచిన ఈ సినిమా లాల్ అభిమానులకే రుచించట్లేదు. ఓవైపు మమ్ముట్టి వరుసగా బ్లాక్‌బస్టర్లు ఇస్తుంటే.. లాల్ ఇలా వరుస ఫ్లాపులతో వెనుకబడిపోతుండడం అభిమానులను బాధిస్తోంది. ఇక తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బరోజ్’తో అయినా లాల్ పుంజుకుంటాడేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.