వారసుడి ధైర్యం వెనుక పెద్ద స్కెచ్

సంక్రాంతి వేడి మాములుగా రాజుకోవడం లేదు. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ ల పోటీతో బాక్సాఫీస్ వద్ద జరగబోయే రచ్చను ఊహించుకుని ట్రేడ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. వీళ్లకు తోడు విజయ్ రావడం కూడా దాదాపు కన్ఫర్మే. దిల్ రాజు నిర్మాత కాబట్టి తెలుగులోనూ పెద్ద రిలీజే ఉంటుంది. అయితే ఆది పురుష్ లాంటి విజువల్ గ్రాండియర్, వాల్తేర్ వీరయ్య – వీరసింహారెడ్డి లాంటి మసాలా ఎంటర్ టైనర్స్ ముందు ఇది తట్టుకుని నిలబడగలదానే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. అయితే ప్రొడక్షన్ హౌస్ తో పాటు నిర్మాణ సంస్థ క్యాలికులేషన్స్ వేరుగా ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.

వాటి ప్రకారం వారసుడు మెయిన్ టార్గెట్ తమిళ మార్కెట్. అక్కడ చిరు బాలయ్య బొమ్మలను పెద్దగా పట్టించుకోరు. సో ఇబ్బంది లేదు. ప్రభాస్ ది యానిమేషన్ టెక్నాలజీ మిక్స్ చేసిన మూవీ కాబట్టి బాహుబలి రేంజ్ లో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తమిళనాడుతో పాటు ఓవర్సీస్ లో బాగా ఆడితే చాలు విజయ్ ఇమేజ్ కు బ్లాక్ బస్టర్ వసూళ్లు వచ్చేస్తాయి. ఎలాగూ శాటిలైట్ డబ్బింగ్ ఓటిటి భారీ రేటుకు అమ్మేశారు. ఇతర డబ్బింగ్ వెర్షన్ల నుంచి వచ్చేది బోనస్ గా తీసుకోవాలి. ఇవన్నీ లెక్కలు వేసుకునే వారసుడుని పొంగల్ రేస్ లో పెట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారట.

వీటికి తోడు ఆడియో హక్కులకే పది కోట్ల దాకా వచ్చిందనే ప్రచారం కోలీవుడ్ ని ఊపేస్తోంది. తమన్ కెరీర్ లోనే ఇది అత్యధిక మొత్తం. ఒకవేళ అజిత్ తునివు కూడా వస్తేనే ఈ వారసుడికి చిక్కులు తప్ప ఇంక దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. పండగ టైంలో స్క్రీన్ల ఇష్యూ పెద్ద ఎత్తున వచ్చేలా ఉంది. ఏపీ తెలంగాణలో ఒకేసారి ఇన్నేసి పెద్ద సినిమాలకు సర్దుబాటు చేసేంత నెంబర్ ప్రస్తుతం లేదు. ఒకవేళ దిల్ రాజు కనక నో కాంప్రోమైజ్ అంటూ వారసుడుని భారీ ఎత్తున దించితే మాత్రం ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏం చేశాడో చూడాలి.