రజినీ పాత సినిమాకు ఇంత డిమాండా

టెక్నాలజీ, ఓటిటిలు ఇంతగా పెరిగిపోయాయి కదా ఏ సినిమా అయినా క్షణాల్లో దొరుకుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. కొన్ని బ్లాక్ బస్టర్లు మరీ పాతవి కాకపోయినా సడన్ గా చూడాలంటే దొరకని పరిస్థితి నెలకొందంటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటిదే సూపర్ స్టార్ రజనీకాంత్ అరుణాచలం. 1997లో విడుదలైన ఈ సూపర్ హిట్ మూవీ తలైవా ఫ్యాన్స్ కు విపరీతమైన ఇష్టం. తెలుగులోనూ పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది. విచిత్రంగా దీని ఒరిజినల్ తమిళ వెర్షన్ ఆన్ లైన్ లో ఎక్కడా అందుబాటులో లేదు. యూట్యూబ్ ఏ అఫీషియల్ ఛానల్ లోనూ అప్లోడ్ చేయలేదు.

ఎప్పుడో పదకొండేళ్ల క్రితం సన్ టీవీలో వచ్చాక దాని హక్కులను రెన్యూవల్ చేసుకోవడంలో ఆలస్యం జరిగి అక్కడి నుంచి టెలికాస్ట్ ఆగిపోయింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసుకున్నా లాభం లేకపోయింది. అతి మాములు క్వాలిటీతో కేవలం తెలుగు డబ్బింగ్ మాత్రమే దొరుకుతోంది. కట్ చేస్తే దశాబ్దం తర్వాత అరుణాచలంని దీపావళి కానుకగా సన్ టీవీ రీ మాస్టర్ చేసిన ప్రింట్ తో ప్రీమియర్ చేస్తోంది. దీనికి సంబంధించిన యాడ్లతో ట్విట్టర్ మోత మోగుతోంది. తలైవర్ ని కొత్తగా చూసుకోవచ్చంటూ మూవీ లవర్స్ సంబరపడుతున్నారు.

ఇంతగా ఎదురు చూస్తున్నారా అనే సందేహం మీకు రావొచ్చు. ఆ మధ్య ఇదే తరహాలో చాలా కాలం తర్వాత పడయప్పా(నరసింహ)ని స్పెషల్ ప్రీమియర్ చేస్తే ఏకంగా 22 టిఆర్పితో మతులు పోగొట్టింది. మాములుగా కొత్త సినిమాలకే ఆ రేటింగ్ రాదు. ఆర్ఆర్ఆర్ 20ని టచ్ చేయలేక ముచ్చెమటలు పట్టించుకుంది. కెజిఎఫ్ 2కి సగం కూడా రాలేదు. అలాంటిది అంత పాత మూవీని తమిళ జనాలు ఆ రేంజ్ లో ఎగబడి చూశారంటేనే రజనీకాంత్ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి అరుణాచలంకు సైతం ఇదే రెస్పాన్స్ వస్తుందనే ధీమాలో ఉంది సన్ టీవీ. అన్నట్టు దీని తెలుగు వెర్షన్ టీవీలో వచ్చి కూడా చాలా కాలమయ్యింది