దసరా నిర్మాతకు భయం లేదా?

సుధాకర్ చెరుకూరి.. తెలుగులో మంచి అభిరుచి ఉన్న యువ నిర్మాతల్లో ఈయనొకరు. నిర్మాతగా కమర్షియల్ లెక్కలేసుకోకుండా సినిమాలు తీశారీయన. కానీ బాక్సాఫీస్ మాత్రం ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ.. ఇలా ఇప్పటిదాకా సుధాకర్ బేనర్ నుంచి వచ్చిన నాలుగు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి.

డిఫరెంట్ సినిమాలు తీయాలనే ప్రయత్నం మంచిదే అయినా.. అవి జనరంజకంగా లేకపోవడంతో చేదు అనుభవాలు తప్పలేదు సుధాకర్‌కు. ఇప్పుడీ నిర్మాత నుంచి రాబోతున్న కొత్త చిత్రం.. దసరా. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి కీర్తి సురేష్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

‘దసరా’లో కీర్తి ‘వెన్నెల’ అనే పాత్రలో నటిస్తోంది. ఈ పేరు వినగానే అందరికీ ‘విరాటపర్వం’ గుర్తుకొస్తోంది. అందులో సాయిపల్లవి చేసిన లీడ్ క్యారెక్టర్ పేరు కూడా ఇదే. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పలేదు. ఆ చిత్రం సుధాకర్‌కు నష్టాలు మిగిల్చింది. ఇలా ఒక సినిమా ఫలితం తేడా కొట్టాక వెంటనే మరో సినిమాలో హీరోయిన్ పాత్రకు ‘వెన్నెల’ అనే పేరే పెట్టడం ఆశ్చర్యకరం.

మామూలుగా ఫిలిం ఇండస్ట్రీలో నెగెటివ్ సెంటిమెంట్లు ఎక్కువ. ఫ్లాప్ సినిమాలకు సంబంధించి అన్నింటినీ వదిలించేసుకుంటారే తప్ప.. ఏదీ రిపీట్ చేయాలనుకోరు. కానీ సుధాకర్ మాత్రం అలా ఆలోచించకుండా తన తర్వాతి సినిమాలో హీరోయిన్‌కు వెన్నెల అని పేరు పెట్టినా ఓకే చేసేయడం ఆశ్చర్యకరమే. ఇదిలా ఉండగా ‘దసరా’కు సంబంధించి చాలా విషయాల్లో ‘పుష్ప’కు పోలికలు కనిపిస్తుండడం పట్ల సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ నడుస్తోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ మీద అతడి గురువు సుకుమార్ ఎఫెక్ట్ చాలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.