అటు క్లాస్ లోనూ ఇటు మాస్ లోనూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఉన్న నలుగురు సీనియర్లలో చిరంజీవి వేగంగా సినిమాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది కానీ నిజానికి ఆయనతో సమానంగా వెంకీ కూడా వరస ప్రాజెక్టులు చేస్తుండటం అంతగా హైలైట్ అవ్వడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ‘ఎఫ్ 3’ వచ్చేసింది. కంటెంట్ మీదే ఎన్ని కామెంట్లు వచ్చినా కలెక్షన్లను బట్టి చూస్తే అది సూపర్ సక్సెస్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎఫ్2 లాగే దీనికి మేజర్ క్రెడిట్ దగ్గుబాటి హీరోకే దక్కుతుంది. ఆ మధ్య కొంచెం గ్యాప్ దొరికితే విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’లో చాలా ముఖ్యమైన టైటిల్ రోల్ చేశారు.
నిజానికి దాని ప్రమోషన్ల కోసం హైదరాబాద్ లో ఉండాల్సింది కానీ సల్మాన్ ఖాన్ ‘కిసీకి భాయ్ కిసీకి జాన్’ షూటింగ్ కోసం ముంబైలో ఉండటంతో ఇక్కడికి రావడం సాధ్యపడలేదు. ఆ మూవీలో పూజా హెగ్డే అన్నయ్యగా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుంది. అంతకన్నా ముందు రానాతో కలిసి నటించిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ అతి త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీపావళికి అనుకున్నారు కానీ పబ్లిసిటీకి తగినంత టైం లేకపోవడంతో వాయిదా వేశారు. నవంబర్ లో ఓ పెద్ద ఈవెంట్ చేసి అన్ని భాషల్లో గ్రాండ్ స్ట్రీమింగ్ చేస్తారు.
ఈ లెక్కన వెంకటేష్ తన అభిమానులను కేవలం ఏడాది కాలంలో నాలుగుసార్లు అభిమానులను పలకరించినట్టు అవుతుంది. నాగార్జున బంగార్రాజు, ది ఘోస్ట్ లతో వచ్చారు. బిగ్ బాస్ 6 రన్ అవుతోంది. బాలయ్యది 2022లో ఇప్పటిదాకైతే ఏ సినిమా రాలేదు. 107 డిసెంబర్ అంటున్నారు కానీ ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. చిరంజీవి దర్శనం ఆచార్య, గాడ్ ఫాదర్ లతో రెండుసార్లు జరిగింది. అందరికంటే ఎక్కువ వెంకటేష్ ఏకంగా ఫోర్ బౌండరీ కొట్టాడు. ఈ స్పీడ్ ఓకే కానీ నెక్స్ట్ ఎవరితో చేస్తారనే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ముందు జాతిరత్నాలు అనుదీప్, తర్వాత తరుణ్ భాస్కర్ ల ప్రాజెక్టు ఉండొచ్చు.