‘గాడ్‌ఫాదర్’ దర్శకుడి మిషన్ సక్సెస్ ఫుల్

‘గాడ్ ఫాదర్’ సినిమా అంతిమ ఫలితం విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ నడుస్తోంది. దసరా సెలవుల్ని ఉపయోగించుకుంటూ తొలి ఐదు రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. కానీ ఆ తర్వాత వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. సోమవారం నుంచి ఏ సినిమాకైనా కలెక్షన్లు తగ్గడం సాధారణమే. కానీ ‘గాడ్ ఫాదర్’ డ్రాప్ అనుకున్నదానికంటే ఎక్కువ. దీంతో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే విషయంలో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అదే సమయంలో నిర్మాత ఎన్వీ లైన్లోకి వచ్చి ఈ చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేశామని, నష్టాల ఊసే లేదని తేల్చేశాడు.

ఐతే అన్ని అంశాలను బేరీజు వేసుకుని చూస్తే ఈ చిత్రాన్నిహిట్ అనలేం. అలాగని ఫ్లాప్ అని కూడా చెప్పలేం. చిరు గత సినిమా ‘ఆచార్య’తో పోలిస్తే ఇది ఏ రకంగా చూసినా మెరుగైన చిత్రమే. కంటెంట్ పరంగానే కాక వసూళ్ల విషయంలోనూ చిరుకు మంచి ఉత్సాహమే ఇచ్చింది.

‘గాడ్ ఫాదర్’ విషయంలో అందరి కంటే ఎక్కువ సక్సెస్ అయింది దర్శకుడు మోహన్ రాజా అని చెప్పాలి. ఈ రోజుల్లో రీమేక్ సినిమా అంటేనే సగం ఆసక్తి చచ్చిపోతోంది. అందులోనూ తెలుగులోనూ ఓటీటీలో అందుబాటులో ఉండి, చాలామంది చూసేసిన ఒక పాపులర్ మూవీని రీమేక్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ‘లూసిఫర్’ చూసే సినిమాకు రండి అనేంత దమ్ము అతడిది. అలా వచ్చిన ఆడియన్స్‌ను అతను నిరాశ పరచలేదు.

ఆసక్తికర మార్పులు, చేర్పులతో మన ప్రేక్షకుల కోణంలో ‘లూసిఫర్’ కంటే మెరుగ్గానే సినిమాను తీర్చిదిద్దాడు. ‘అందరూ దొరికిపోండి’ అంటూ చిరు డైలాగ్ చెప్పే ఒక్క సీన్ చాలు.. మోహన్ రాజా సత్తా ఏంటో చెప్పడానికి. ఒరిజినల్లో లేని ఈ సన్నివేశానికి థియేటర్లలో మామూలు రెస్పాన్స్ రాలేదు. మిగతా కొత్త సన్నివేశాలు, కథలో మార్పులు కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. మొత్తంగా మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’ విషయంలో తన బాధ్యతను నూటికి నూరుశాతం నెరవేర్చాడనే చెప్పాలి. ఇలా తన మిషన్‌ను సక్సెస్ ఫుల్ చేసిన మోహన్ రాజా.. ‘గాడ్ ఫాదర్’తో తన రెండేళ్ల ప్రయాణం ముగిసిందంటూ చెన్నైకి వెళ్తూ ఒక ఎమోషనల్ పోస్టూ కూడా పెట్టాడు ట్విట్టర్లో.