టాలీవుడ్లో ఎవరిని అడిగినా అల్లు అరవింద్ అంత తెలివైన నిర్మాత మరొకరు లేరు అనే అంటారు. ఆయనంత తెలివైన వాడు కాబట్టే తన తరం నిర్మాతలందరూ ఎప్పుడో దుకాణం కట్టేసినా.. తను మాత్రం ఇప్పటికీ యాక్టివ్‌గా ఉంటూ విజయవంతమైన నిర్మాతగా కొనసాగుతున్నారు.
ట్రెండ్ మారుతున్న విషయాన్ని గమనించి ‘ఆహా’ ఓటీటీని మొదలుపెట్టి దాన్ని మంచి స్థాయికి తీసుకెళ్లారు. ఐతే ఈ తెలివితేటలు ఈనాటివి కావని.. యుక్త వయసులో ఉండగానే తన టాలెంట్ చూపించానని, తన తెలివికి చిన్నప్ప దేవర్ అనే ఒకప్పటి టాప్ ప్రొడ్యూసర్ కూడా షాకైపోయారని ఆయన ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు.
మీరు తెలివైన వారని మీ నాన్న గుర్తించారా.. ఎప్పుడైనా ఆ మాట మీతో చెప్పారా అని ఆలీ.. అరవింద్‌ను అడగ్గా.. నేరుగా చెప్పలేదు కానీ, ఆయనకు నా తెలివితేటల మీద గురి ఉండేదని అరవింద్ వ్యాఖ్యానించారు.
తాను యుక్త వయసులో ఉండగానే ఏ విషయమైనా తనతో చెప్పి సలహా అడిగేవారని, దాన్ని బట్టే తన మీద ఆయనకున్న నమ్మకం అర్థమయ్యేదని అరవింద్ చెప్పారు. ఇక చిన్నప్ప దేవర్‌తో జరిగిన ఇన్సిడెంట్ గురించి గుర్తు చేసుుకంటూ… ‘‘ఒకసారి నాన్న గారు నాకు ఫోన్ చేసి చిన్నప్ప దేవర్ నిన్ను కలవాలంటున్నారు. వెంటనే రా అని చెప్పారు. కారు పంపిస్తే వెంటనే ఆయన దగ్గరికి వెళ్లా. నేను భయపడుతూ ఆయన దగ్గరికి వెళ్తే.. ఆయన మా ఇద్దరి తగువు భలే తీర్చావురా అంటూ అభినందించారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ సినిమాకు గాను ఆయన నాన్న గారికి 12 వేల రూపాయల పారితోషకం ఇవ్వాలనుకున్నారు. కానీ నాన్న గారు 15 వేలుకే చేయాలనుకున్నారు. కానీ ఆయన మాత్రం సింగిల్ పేమెంట్ 12 వేలు ఇస్తా. తీసుకుని సినిమా చెయ్యి అన్నారు. ఈ విషయాన్ని నాన్న ముందు రోజు నాకు చెబితే.. 12 వేలు ఆయనకు ఇచ్చేసి, సినిమా అయ్యాక దానికి వడ్డీ కలిపి ఇవ్వమని చెప్పు అని సలహా ఇచ్చా. వడ్డీ కలిపితే ఆటోమేటిగ్గా 15 వేలు అవుతుంది. అప్పుడు ఆయనకు, నీకు ఇద్దరికీ నష్టం ఉండదు అని చెప్పా. ఈ విషయం అలాగే వెళ్లి నాన్న ఆయనకు చెప్పారు. ఆయనకు మైండ్ బ్లాంక్ అయిపోయి వెంటనే నన్ను పిలిపించి నావి గొప్ప తెలివితేటలంటూ అభినందించారు’’ అని అరవింద్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates